News

బీఎస్ఎఫ్‌ దెబ్బకు.. పాక్‌ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే : అమిత్‌ షా

273views

పాకిస్థాన్‌ దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాల (BSF)పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. ఇటీవల చేపట్టిన సైనిక ఆపరేషన్‌ సమయంలో పాక్‌లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయని అన్నారు. వారి సమాచార, నిఘా నెట్‌వర్క్‌ను కూల్చివేశాయన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన ఆయన.. బీఎస్‌ఎఫ్‌ కొట్టిన దెబ్బకు శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు.

‘‘ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మనం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్‌ సైన్యం మన సరిహద్దులోని పౌరులపై దాడులు చేసింది. వీటిని మన బీఎస్‌ఎఫ్‌ దళాలు దీటుగా తిప్పికొట్టాయి. దాదాపు 118 పాక్‌ పోస్టులను ధ్వంసం చేశాయి. శత్రువుల నిఘా వ్యవస్థను ఒక్కొక్కటిగా కూల్చివేశాయి. వాటిని పునరుద్ధరించేందుకు శత్రువులకు దాదాపు నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుంది’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ నుంచి తనకు అందించిన సమాచారం ప్రకారం.. పాక్‌ సైనిక సమాచార, నిఘా వ్యవస్థలకు భారీ దెబ్బ తగిలిందన్నారు. కొంతకాలం పూర్తి సమాచార ఆధారిత యుద్ధాన్ని చేసే పరిస్థితిలో వారు లేరన్నారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎఫ్‌ సంసిద్ధతపై అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. అప్రమత్తంగా ఉంటూ స్పష్టమైన వ్యూహాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు. భారత సరిహద్దులో ఎటువంటి దాడులు జరిగినా మొదట ఆ భారాన్ని మోసేది బీఎస్‌ఎఫ్‌ జవాన్లేనని అన్నారు.
త్వరలో ప్యాకేజీ..

జమ్మూ కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇటీవల పాకిస్థాన్‌ జరిపిన దాడుల సందర్భంగా నష్టపోయిన కుటుంబాలను అమిత్‌ షా పరామర్శించారు. పాక్‌ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిన పరిహార ప్యాకేజీని కేంద్రం త్వరలో ప్రకటిస్తుందన్నారు. పాక్‌ దాడుల్లో దెబ్బతిన్న పలు ప్రాంతాలను పరిశీలించిన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడారు.