
మొదటి భాగం ఇక్కడ చదవండి. చైనా – అప్ఘాన్ ఒప్పందం భారత్ ప్రాదేశిక ప్రాభవానికి సవాల్ అవుతుందా? – 1
ఆ తరువాయి….
చైనా ఋణపు ఊబిలో చిక్కుకున్న పాకిస్తాన్ :–
సిపిఇసిలో పాకిస్తాన్ భాగస్వామ్యానికి కారణం విద్యుత్, మౌలిక సదుపాయాల రంగాల్లో అది ఎదుర్కొంటున్న సంక్షోభమే. పాకిస్తాన్ నగర కేంద్రాలకూ, పారిశ్రామిక అవసరాలకూ విద్యుత్ లభించని దుస్థితి నెలకొని ఉంది. ఆ స్థితిలో పాకిస్తాన్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, జాతీయ రహదారులు, ఓడరేవుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి చైనా ముందుకు రావడం పాకిస్తాన్‌కు ఆశాకిరణంగా కనిపించింది.
అయితే 2021లో చైనా బొగ్గు ఆధారిత ప్రాజెక్టుల నిర్మాణం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ పర్యావరణం కోసం నిర్వహించిన కాప్ 26 సదస్సులో చేసిన వాగ్దానాలను సాకుగా చూపించి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించబోమని చైనా స్పష్టం చేసింది. దాంతో తమ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని 20 గిగావాట్లకు పెంచుకోవాలన్న పాకిస్తాన్ ఆశలు అడియాసలయ్యాయి. ఆ దేశపు విద్యుత్ రంగం మళ్ళీ అంధకారంలో కూరుకుపోయింది.
అసలే ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ పరిస్థితిని సిపిఇసి ప్రాజెక్టు మరింత దిగజార్చింది. చైనా ఫైనాన్స్ మీద ఆధారపడడంతో పాకిస్తాన్ ఋణభారం మరింత పెరిగిపోయింది. సిపిఇసి ప్రాజెక్టుల కోసం వివిధ రకాల వస్తువులను భారీగా దిగుమతులు చేసుకోవడంతో కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగిపోయింది. ఆ సమస్యలను దాటడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 630 కోట్ల డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ తీసుకోవలసి వచ్చింది.
ఐఎంఎఫ్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, సిపిఇసి ప్రాజెక్టు కోసం, పాకిస్తాన్ అడ్డూ అదుపూ లేకుండా ఋణాలు తీసుకోవడంతో ఆ దేశపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయాయి. ఋణాలు చెల్లించడానికి గడువును పెంచాలి లేదా వాయిదా వేయాలన్న పాకిస్తాన్ అభ్యర్ధనను చైనా నిరాకరించింది. దాన్నిబట్టే, పాకిస్తాన్ మీద వ్యూహాత్మక ఆధిపత్యం కోసం చైనా ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్ధం అవుతుంది.
ఇలా పాకిస్తాన్‌ను చైనా అప్పుల వలలో బిగించేయడం సిపిఇసి ప్రాజెక్టు దోపిడీ లక్షణాన్ని తెలియజేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కంటె, చైనా ప్రయోజనాలకు పట్టం కట్టడమే సిపిఇసి లక్ష్యం.
అప్ఘానిస్తాన్‌కూ విస్తరించిన సిపిఇసి దోపిడీ :–
సిపిఇసిని అప్ఘానిస్తాన్‌కు విస్తరించడం ఆ ప్రాంతంలోని వనరులను దోచుకోవడానికి, మధ్య ఆసియాలో తన ఆధిక్యాన్ని బలోపేతం చేసుకోడానికీ చైనా పన్నిన వ్యూహం. బీజింగ్ రహస్య సమావేశంలో ప్రకటించిన మేరకు ఈ విస్తరణలో ఏయేం ఉంటాయంటే….
· మౌలిక వసతుల దోపిడీ: ఎంఎల్-1 రైల్వేను అప్ఘానిస్తాన్ రవాణా కారిడార్లతో కలిపేవరకూ విస్తరించడం, తోర్ఖామ్, స్పిన్ బోల్డాక్ సరిహద్దు క్రాసింగ్స్ వరకూ జాతీయ రహదారులు నిర్మించడం అనే చర్యలు ప్రాంతీయ వాణిజ్య మార్గాల మీద చైనా పట్టు బిగించడానికి ఉద్దేశించినవి.
· వనరుల లూటీ: అప్ఘానిస్తాన్‌లో అపారమైన లిథియం, ఇతర అరుదైన లోహాల గనులు ఉన్నాయి. అవి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలకు ఎంతో అవసరం. అంతే తప్ప అప్ఘానిస్తాన్ సార్వభౌమత్వం గురించి కానీ, అక్కడి వనరుల ద్వారా వచ్చే లాభాలను వారితో పంచుకోవడం గురించి కానీ చైనాకు ఆసక్తి లేదు.
· విద్యుత్ రంగంలో మోసం: అప్ఘాన్ భూభాగం నుంచి ఇరాన్, మధ్య ఆసియా వరకూ పైప్‌లైన్‌లను అభివృద్ధి చేయాలన్నది చైనా వ్యూహం. అందులో ప్రాంతీయ సుస్థిరత కంటె చైనా తమ దేశపు విద్యుత్ రంగ భద్రతకే ప్రాధాన్యం ఇస్తోంది.
· మిలటరీకి ముసుగు: పౌర వాణిజ్య మౌలిక సదుపాయాల సాకుతో మిలటరీ అవసరాలకు సరిపడే రవాణా నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసే ప్రయత్నీలు చైనా దీర్ఘకాలిక వ్యూహాల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి.
తాలిబన్ ప్రభుత్వ నాయకత్వంలోని అప్ఘానిస్తాన్ ఆర్థిక బలహీనతలను వాడుకుంటూ చైనా ఇలాంటి విస్తరణ ద్వారా మధ్య ఆసియాలోకి చొచ్చుకొస్తోంది. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడతామనే ఆశ చూపించి అప్ఘానిస్తాన్‌లోని విలువైన వనరులున్న ప్రొవిన్స్‌లను తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
దక్షిణ ఆసియాలో ప్రాభవం పెంచుకోవాలనుకుంటున్న చైనా ఆకాంక్షలకు సిపిఇసి ద్వారా పాకిస్తాన్ ఒక మార్గంగా ఏర్పడింది. మధ్య ఆసియాలోని వనరులు, వాణిజ్య నెట్‌వర్క్‌ల మీద ఆధిపత్యం కోసం బీజింగ్ అమలు చేస్తున్న వ్యూహంలో అప్ఘానిస్తాన్ పావుగా మారింది. త్రైపాక్షిక సహకారం పేరుతో చైనా అమలు చేస్తున్న ఆచరణ, నిజానికి ఆ దేశపు దోపిడీ అజెండాను బహిర్గతం చేస్తోంది. భాగస్వామ్య పక్షాల సార్వభౌమత్వాన్నీ, స్థిరత్వాన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆర్థిక, వ్యూహాత్మక లాభాలే లక్ష్యంగా చైనా అడుగులు కదుపుతోంది.
(సశేషం)





