News

అమీర్‌ ఖాన్‌కు నిరసన సెగ

218views

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు దేశంలో నిరసన సెగ తగిలింది. ఇన్నాళ్లూ ఆపరేషన్‌ సింధూర్‌పై నోరు విప్పని ఖాన్‌.. ఇప్పుడు తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్‌ లాంచ్ వేళ స్పందించడంపై మండిపడుతున్నారు. ట్రైలర్‌ లాంచ్‌ వేళ ఖాన్‌ తన సినిమాకు ప్రేక్షకుల మద్దతు కోరారు. మరోవైపు ఆపరేషన్‌ సింధూర్‌పై ఎక్స్‌ వేదికగా స్పందించారు.

‘ఆపరేషన్‌ సింధూర్‌లో పాల్గొన్న సైనికులకు వందనం. దేశ రక్షణలో సైనికులు కనబరుస్తున్న అకుంటిత దీక్ష, వారి ధైర్యసాహసాలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు. జైహింద్‌’ అని అమీర్‌ ఖాన్‌కు చెందిన ‘అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ ఎక్స్‌ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్‌ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘సితారే జమీన్ పర్’ సినిమా ట్రైలర్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను 2007లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. అయితే సినిమా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే హీరో అమీర్‌ఖాన్‌కు నిరసన సెగ తగిలింది. సినిమాను బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బైకాట్ ‘సితారే జమీన్‌ పర్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండింగ్‌ చేస్తున్నారు.

పహల్గామ్ ఘటన తరవాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై అమీర్ ఖాన్ ఎప్పుడూ గొంతు విప్పలేదు. పైగా ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు మద్దతు పలికిన టర్కీ అధ్యక్షుడిని ఖాన్‌ కలిశారు. దాంతో ఆ వీడియోను వైరల్ చేస్తూ అమీర్‌ఖాన్‌పై మండిపడుతున్నారు. అప్పడు సరదాగా టర్కీలో గడిపి.. ఇప్పుడు తన సినిమా కోసం సైనికులను వందనం చేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు. ఆయన సినిమాను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.