News

ఆపరేషన్‌ సిందూర్‌పై అలహాబాదియా వివాదాస్పద పోస్ట్‌

270views

పాడ్‌కాస్టర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్తానీ అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన రణ్‌వీర్‌.. వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తడంతో పోస్ట్‌ను తొలగించాడు. పహల్గాం ఉగ్రవాదాడి అనంతరం.. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. దీనిపై యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశాడు.

‘‘ప్రియమైన పాకిస్తానీ సోదర సోదరీమణులారా.. ఇది రాయడం వల్ల మరో వివాదానికి ఆహ్వానం పలుకుతానని నాకు తెలుసు. చాలా మంది భారతీయులు నాపై ద్వేషం చిందిస్తారు. అయితే.. చాలా మంది భారతీయుల్లా నా హృదయంలో మీ మీద ద్వేషం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది మాలాగే శాంతిని కోరుకుంటున్నారు. తరువాత ఎప్పుడైనా మేము మిమ్మల్ని కలిసినప్పుడు మమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తారు. మేం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాం అనిపిస్తే క్షమించేయండి.

మిమ్మల్ని కలిసినప్పుడు భారతీయులు కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు రెండు దేశాల్లో మీడియా చానళ్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఇరుదేశాల్లోని ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉండే ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ.. పాకిస్తాన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ కలిసి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్‌ కోరుకుంటోంది.

ఉగ్రవాదాన్ని ఆర్మీ పెంచి పోషిస్తుందనడానికి మూడు ఉదాహరణలున్నాయి. ఒకటి.. ఇన్నేళ్లలో పట్టుబడిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌వారే. రెండోది.. జైషే మహ్మద్‌ చీఫ్‌ సోదరుడు హఫీజ్‌ అబ్దుర్‌ రవూఫ్‌ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. దానికి పాక్‌ మిలిటరీ అధికారులు కూడా హాజరయ్యారు. మూడోది.. పాక్‌ రక్షణ శాఖా మంత్రి ఖవాజా ఆసిఫ్‌ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ టెర్రరిజాన్ని పాక్‌ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని అంగీకరించాడు. అయినా.. పాకిస్తాన్‌ ప్రజల పట్ల మాకు సానుభూతి ఉంది. ఈ ఆపరేషన్‌ భారతీయులు, పాకిస్తానీయుల మధ్య యుద్ధం కాదు.

భారత్‌.. పాకిస్తాన్‌ మిలిటరీ, ఐఎస్‌ఐపై చేస్తున్నది. శాంతి కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని పోస్టులో పేర్కొన్నాడు. రణ్‌వీర్‌ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన భారత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, భారత ఆర్మీని కూడా అవమానించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతిస్తున్నాడని మండిపడ్డారు. దీంతో.. ఆయన పోస్టును డెలిట్‌ చేశారు. రణ్‌వీర్‌ అల్లహాబాదియా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. తల్లిదండ్రుల గురించి అనుచిత జోకులు వేసినందుకు ఈ ఏడాది ప్రారంభంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.