News

పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్

181views

ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్‌ జెట్లను కూల్చేసింది. పాక్‌ పైలట్‌ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్‌ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశారు. పాక్‌ దాడి తర్వాత- ఫైసలాబాద్, సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్‌ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచీ దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడిచేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్‌ ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ మానవ రహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థ (గ్రిడ్‌ అండ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు)తో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్‌ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్‌ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో గురువారం సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ కార్యాలయంలో సమావేశం జరుగుతుండటం గమనార్హం. గురువారం రాత్రి పాక్‌ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.

జమ్మూ, ఉధంపుర్, అఖ్నూర్, పూంఛ్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, పోఖ్రాన్, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్‌ లక్ష్యంగా పాక్‌ ఈ డ్రోన్లను ప్రయోగించింది.
సత్వారా, సాంబా, ఆర్‌ఎస్‌ పురాల్లో క్షిపణి దాడులకు పాక్‌ ప్రయత్నించింది.
జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలవైపు డ్రోన్లు వచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లలోకి వెళ్లిపోయారు. దుకాణాలను మూసివేశారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చేసింది. జమ్మూ సిటీలో విద్యుత్తు సరఫరాను అధికారులు నిలిపేశారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు మూగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలున్నాయి. విమానాశ్రయంవద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.
జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్‌ డ్రోన్లను భారత్‌ ధ్వంసం చేసింది.
ఉరీలో పౌర నివాసాలే లక్ష్యంగా పాక్‌ దాడులకు తెగబడింది.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్‌ ఐఎస్‌ఐ సూచించింది. దీంతో అనంత్‌నాగ్‌లోని ఖుండ్రూలో ఉన్న ఆయుధ డిపోవద్ద పేలుళ్లకు వారు పాల్పడినట్లు సమాచారం.
ఉద్రిక్తతల దృష్ట్యా అఖ్నూర్, కిశ్త్‌వాద్, సాంబా సెక్టార్‌లలో అధికారులు పూర్తిగా విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.
హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఐపీఎల్‌ మ్యాచ్‌ను భద్రతా కారణాలరీత్యా అర్ధంతరంగా రద్దు చేశారు.
పలు రాష్ట్రాల్లో అధికారులకు సెలవులను ప్రభుత్వాలు రద్దు చేశాయి. విద్యా సంస్థలకు సెలవులిచ్చాయి.
దిల్లీలో ప్రజలు ప్రముఖ ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించారు.
‘జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపుర్‌లను పాక్‌ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. వెంటనే వాటిని నిర్వీర్యం చేశాం. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు’ అని రక్షణశాఖ అధికార ప్రతినిధి గురువారం రాత్రి తెలిపారు.
అన్ని పారామిలిటరీ బలగాల డీజీలతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వయంగా మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు.