News

ఇస్లామిక్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతివ్వాలి

630views

శ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్‌ లేవనెత్తింది. కశ్మీర్‌ లేకుండా దేశం లేదని స్పష్టం చేసింది. వాషింగ్టన్‌ వేదికగా మానవహక్కుల మీద జరుగుతున్న యూఎస్‌ కాంగ్రెషనల్‌ సమావేశాల్లో భారత్‌ తరఫున ప్రముఖ కాలమిస్ట్ సునందా వశిష్ఠ్‌ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాకిస్థాన్‌ తీరును సునంద ఎండగట్టారు. కశ్మీర్‌ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగా హెచ్చరించారు. తిరుగుబాటు దాడులను తరిమికొట్టడం తమకేం కొత్తకాదంటూ చురకలు అంటించారు.
‘మా దేశ ప్రజాస్వామ్యాన్ని మేం విజయవంతంగా కాపాడుకుంటున్నాం. ఒకప్పుడు పంజాబ్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు ఎదురై మానవహక్కులకు విఘాతం ఏర్పడింది. అప్పుడు దాన్ని సమర్థంగా నియంత్రించుకున్నాం. ఇప్పుడు కూడా ఉగ్రవాదమనే తిరుగుబాటుపై వ్యతిరేకంగా పోరాటం చేసి భారత్‌ను బలపర్చాల్సిన సమయం వచ్చింది. మానవ హక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన తరుణమిదే. ఇప్పటికే కశ్మీర్‌లోయలో పాకిస్థాన్‌ నీడలో పెరిగిన ఉగ్రమూకలు చాలా దాడులు చేశాయి. ఆ దాడుల్లో మేం ముఖ్యంగా నా కుటుంబం చాలా నష్టపోయింది. నివాసాలతో సహా జీవితాలను కూడా కోల్పోయాం. అక్కడ వినిపించిన చావుకేకలన్నింటికీ కారణం పాకిస్థాన్‌ శిక్షణలో పెరిగిన ఉగ్రమూకలే. కానీ, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామంటూ అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఇలాంటి రెండు నాల్కల ధోరణి వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఇస్లామిక్‌ టెర్రర్‌ మీద భారత్ చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు అవసరం’ అని సునంద అన్నారు.

ఈమె వ్యాఖ్యలపై టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్‌ విమెన్‌ షీలా జాక్సన్‌ లీ స్పందించారు. కశ్మీర్‌ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితిని వివరించాలని కోరారు. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రతినిధుల బృందం కశ్మీర్‌లో పర్యటించాలనకుంటోందని, అందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతించాలని కోరారు.