
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెంచలకొన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆనం ఆదేశాలు జారీచేశారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. 12 రోజుల పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రెండు నెలల క్రితం పులి సంచరిస్తోందని సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశించారు. అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ అర్చకుల సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.





