
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి తో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి భారత్ బాక్సింగ్ ఛాంపియన్ గౌరవ్ బిధూరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనతో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్థానీలను పిచ్చివాళ్లను చేశాయి. ఎనిమిది లక్షల మంది భారత సైనికులు దాడిని ఆపడానికి ఏమీ చేయలేకపోయారని అఫ్రిదీ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 1971లో 93 వేల మంది పాకిస్థానీ సైనికులు మా సైన్యం ముందు లొంగిపోయారు. అందుకే మా సామర్థ్యం గురించి మాకు పాఠాలు చెప్పొద్దు. ఆధారాలు అడుగుతున్నారు. అసలు మీకు ఎందుకు నిరూపించాలి. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది’’ అని ఘాటుగా విమర్శించారు.
‘‘ఇక మీరు క్రీడాదౌత్యం గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల నీరజ్ చోప్రా స్వయంగా మీ ఒలింపిక్ ఛాంపియన్ నదీమ్‌ను ఆహ్వానించిన విషయాన్ని మీకు గుర్తుచేస్తున్నా. క్రీడా స్ఫూర్తి గురించి మీరు మాకు చెప్పకండి. మీకు పీఎస్‌ఎల్ ఉంది. మాకు ఐపీఎల్ ఉంది. కానీ ప్రపంచ క్రీడాకారులు ఎక్కడ ఆడుతున్నారో చూడండి. మీరు భారత్‌కు వచ్చినప్పుడు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. కానీ ప్రపంచ క్రీడాకారులు వస్తున్నది మా దేశానికి.. మీ దగ్గరికి కాదని గ్రహించండి. పాక్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుసు’’ అని బిధూరి చురకలు అంటించారు.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడిపై అఫ్రిదీ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని కించపర్చేలా వ్యాఖ్యానించాడు. అనుచిత పదజాలంతో భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. పహల్గాం దాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమన్న భారత్.. దాయాదితో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి పాక్ మంత్రులు, నేతలతో పాటు అక్కడి మీడియా కూడా మనపై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది.
ఇదిలాఉంటే.. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్ర్య పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారితీసింది. భారత్ సైన్యం పాక్‌ను ఓడించి, స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించింది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఫీల్డ్ మార్షల్ మానెక్ షా పటిష్ట వ్యూహ రచన జరిపి, విజయాన్ని భారత్ పరం చేశారు. ‘మీరు లొంగిపోండి లేకపోతే తుడిచిపెట్టేస్తాం’ అని డిసెంబర్ 13, 1971న మానెక్ షా పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చారు. ఆ ఒక్క హెచ్చరికతో 93వేల మందికి పైగా పాక్ బలగాలు భారత్ ముందు లొంగిపోయాయి. దానిని ఉద్దేశించే బిధూరి కౌంటర్ ఇచ్చారు.




