
( ఏప్రిల్ 29 – పరశురామ జయంతి )
పరశు అంటే గండ్రగొడ్డలి. మహేశ్వరుడు ప్రసాదించిన ఆ పరశుతో దుష్టసంహారం చేసేవాడు. అందుకే ఆయన పరశురాముడయ్యాడు. శివకేశవుల శక్తిసంపత్తులు కలసి అవతరించిన రూపమే పరశురాముడు. భృగు వంశంలో పుట్టడం వల్ల భార్గవరాముడు అని కూడా పేరు. రేణుకా జమదగ్నుల పుత్రుడాయన. పరశును ప్రసాదించిన పరమశివుడే ఒకసారి ఆయనను పిలిచి ‘దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతోంది. నువ్వెళ్లి దేవతలకు సాయం చెయ్యి’ అన్నాడు. ‘స్వామీ! నీవిచ్చిన గండ్రగొడ్డలి తప్ప మరే ఆయుధం లేదు. నేనెలా యుద్ధం చేయగలను?’ అన్నాడు పరశురాముడు. బదులుగా శంకరుడు ‘నేను నిన్ను ఆవహించి.. నీలో ఉండి యుద్ధం చేస్తాను’ అని వివరించాడు. అలా శివుడి అంశ పరశు రాముడిలోకి ప్రవేశించింది. కనుకనే పరశురాముడిది ఆవేశావతారం అని చెబుతారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో పరశురామ అవతారం ఆరోది. రామాయణంలో పరశురాముడు తొలిసారి సీతాస్వయంవరంలో కనిపిస్తాడు. శివ ధనుస్సు విరిచినందుకు పరశురాముడు కోపించి, శ్రీరాముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. తుదకు తన మరో అవతారమే ఆ రామచంద్రుడని తెలుసుకుని మహేంద్రగిరిపై తపస్సుకు వెళ్లిపోయాడు. పురాణాల ప్రకారం పరశురాముడు విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి పలు విద్యలు నేర్పాడు. తండ్రి జమదగ్ని మహర్షిని అవమానించినందుకు కార్తవీర్యుడి అంతుచూశాడు పరశురాముడు. పితృవాక్యపరిపాలనలో రాముణ్ణి తలపిస్తాడు.
సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడు ధర్మరాజుకు పరశురాముడి సాహసాల్ని గుర్తుచేశాడు. గంగాదేవి అభ్యర్థన మేరకు భార్గవరాముడు భీష్మునికి అస్త్రవిద్యలు బోధించాడు. కర్ణుడు కూడా శిష్యునిగా చేరాడు. ద్రోణాచార్యుడు ఈ భార్గవరాముడి నుంచి దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్న సమయంలో పరశురాముణ్ణి దర్శించాడు. ఆయనోసారి గర్వం నష్టదాయకం అంటూ కౌరవులకు వివరించాడు. మన పురాణాలు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసమహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు తదితరులతో పాటు పరశురాముణ్ణి సప్తచిరంజీవుల్లో ఒకనిగా పేర్కొన్నాయి. కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, గోవా రాష్ట్రాల్లో పరశురాముడికి ఆలయాలు ఉండటం విశేషం.





