
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.
కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.
అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను ‘శిక్ష అనుభవిస్తున్నానని’ ఆమె వాపోయింది. పహల్గామ్లో జరిగింది తప్పు… అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్‌లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం.”అంటూ విచారం వ్యక్తంచేశారు.
కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.





