
మనసులో మాట పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం 121వ ఎసిపోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తనను ఎంతగానో కలచివేసిందని.. ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడని అన్నారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ.. ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారని.. ఇదే భారత్‌లో ఉన్న గొప్పదనమని కీర్తించారు. జమ్మూకశ్మీర్ సాధిస్తున్న అద్భుత పురోగతిని చూసి ఓర్వలేకే.. ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘జమ్మూ కశ్మీర్‌లో శాంతిని స్థాపించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నాయి. యువత ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకం పెరుగుతోంది. ఇదంతా చూసి మన శత్రువులు ఓర్చుకోలేకపోయారు. కశ్మీర్‌ను మరోసారి నాశనం చేయాలనుకున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని.. దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు.
ఉగ్రవాదంపై చేస్తున్న యుద్ధంలో దేశ ఐక్యత, 140 కోట్లమంది ప్రజల మద్దతు భారత సైన్యానికి అతిపెద్ద బలమని పేర్కొన్నారు. మనలో ఉన్న ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దాడిని భారత ప్రజలు ఒకే గొంతుతో వ్యతిరేకించడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయన్నారు. భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిన సమయం వచ్చిందని మోదీ అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని బయటకు లాగుతామని.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవారి వెన్ను విరుస్తామని హెచ్చరించారు.





