News

తిలకం ధరించినందుకు తొమ్మిదేళ్ల హిందూ బాలుడిపై పాఠశాల ఆంక్షలు..

3views

హిందూ మత సంప్రదాయాలను పాటించే హక్కుపై బ్రిటన్‌లో కీలక న్యాయపోరాటం ప్రారంభమైంది. నుదుటిపై స్వామినారాయణ సంప్రదాయానికి పవిత్రమైన ‘తిలక్‌-చాంద్లో’ ధరించినందుకు తొమ్మిదేళ్ల హిందూ బాలుడిని పాఠశాల నుంచి తొలగించారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు ఇంగ్లాండ్, వేల్స్ హైకోర్టును ఆశ్రయించారు.

పశ్చిమ లండన్‌లోని వికర్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్‌లో ఈ వివాదం చోటుచేసుకుంది. స్వామినారాయణ సంప్రదాయాన్ని అనుసరించే ఈ బాలుడు 2021 నుంచి అదే పాఠశాలలో చదువుతున్నాడు. అప్పటి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రతిరోజూ తన నుదుటిపై ‘తిలక్‌-చాంద్లో’ ధరించేవాడు. అయితే 2025 చివరిలో పాఠశాల యాజమాన్యం ఈ మతపరమైన గుర్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది.ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు చివరకు తమ కుమారుడిని పాఠశాల నుంచి తీసివేసి, న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

తమ న్యాయవాదుల ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. “కేవలం తన విశ్వాసాన్ని ఆచరించాలనుకున్నందుకు మా కుమారుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం తల్లిదండ్రులుగా మాకు ఎంతో బాధ కలిగిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా తిలక్‌-చాంద్లో ధరించి పాఠశాలకు వెళ్తున్నాడు. మా కుటుంబానికి ఎంతో పవిత్రమైన మత చిహ్నం ఒక వివాదానికి కారణమవుతుందని ఎన్నడూ ఊహించలేదు” అని పేర్కొన్నారు.

“మా కుమారుడు ఇతర పిల్లల మాదిరిగానే చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, స్నేహితులతో గడపడం ఇష్టపడతాడు. అతను ధరించే మతపరమైన గుర్తు ఎవరికీ హాని కలిగించలేదు. అతని చదువుకు కూడా ఎలాంటి ఆటంకం కలిగించలేదు. అన్ని మతాలను గౌరవించాలని మేము మా పిల్లలకు నేర్పిస్తున్నాం. మా విశ్వాసాన్ని కూడా అదే విధంగా గౌరవించాలని కోరుకుంటున్నాం. మరే ఇతర బాలుడికీ మతం, విద్యలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదు” అని వారు స్పష్టం చేశారు.

బ్రిటన్ చట్టాల ప్రకారం న్యాయపోరాటం
ఈ కేసులో ‘ఆశ్రయ్ లా’ న్యాయ సంస్థ బాలుడి కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్రిటన్‌లోని సమానత్వ చట్టం-2010 ప్రకారం మతపరమైన వివక్షకు పాల్పడ్డారనే ఆరోపణతో పాటు, మానవ హక్కుల చట్టం-1998 కింద తమ హక్కులకు భంగం కలిగిందని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో పాఠశాల నుంచి 25,000 పౌండ్ల (సుమారు £25,000) నష్టపరిహారాన్ని కుటుంబం కోరుతోంది. ప్రస్తుతం న్యాయపరమైన విచారణ కొనసాగుతోంది. అయితే కుటుంబం చేసిన ఆరోపణలను పాఠశాల ఖండించింది.

ఆశ్రయ్ లా డైరెక్టర్ అంబ్రిష్ లింబాచియా మాట్లాడుతూ, ఈ కేసు ఒక బాలుడికి లేదా ఒక పాఠశాలకు మాత్రమే సంబంధించినది కాదని, బ్రిటన్ విద్యావ్యవస్థలో మత స్వేచ్ఛ, సమానత్వం, మైనారిటీ మత సంప్రదాయాల పట్ల గౌరవం వంటి కీలక అంశాలను ముందుకు తెస్తోందని అన్నారు.

పాఠశాల వాదన ఏమిటి?
తిలక్‌-చాంద్లో విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం పాఠశాల సిబ్బంది బాలుడి మతపరమైన ఆచారాల గురించి పదేపదే ప్రశ్నించారని, కొన్ని పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను వికర్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చింది. తాము కుటుంబం మత విశ్వాసాల పట్ల పూర్తి గౌరవంతో, ఎంతో సున్నితంగా వ్యవహరించామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రతిపాదించామని పాఠశాల తెలిపింది. అయితే ఆ ప్రతిపాదనలను తల్లిదండ్రులు అంగీకరించలేదని పేర్కొంది.

హిందూ సంస్థల మద్దతు
ఈ న్యాయపోరాటానికి ‘యాక్షన్ ఫర్ హార్మొనీ’ అనే మత సామరస్య సంస్థ కూడా మద్దతు ప్రకటించింది.ఆ సంస్థ అధిపతి నితిన్ పాలన్ మాట్లాడుతూ, మత సమానత్వం అన్ని వర్గాలకూ వర్తించాలని, హిందూ పిల్లల మత సంప్రదాయాలు, విశ్వాసాలు కూడా వారి వ్యక్తిత్వం, సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగమని పేర్కొన్నారు.

“విభజన సృష్టించడం మా లక్ష్యం కాదు. పరస్పర అవగాహన, న్యాయం, ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం లభించేలా చూడటమే మా ఆశయం. ఈ న్యాయపోరాటం ద్వారా ఒక ముఖ్యమైన సూత్రం స్థిరపడుతుందని ఆశిస్తున్నాం” అని ఆయన తెలిపారు.