
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో చోటుచేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీశ్ రంజన్, కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ ప్రాణాలు కోల్పోయారు. పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు.
ఘాతుకానికి పాల్పడింది ఎవరు?
కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు.
అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్ర
అమర్నాథ్ యాత్రకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 38 రోజులపాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఈ మార్గాల్లో ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కి.మీ. దూరం ఉండగా, మరొకటి గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కి.మీ. దూరం ఉంటుంది.





