News

సివిల్స్ 2024 తుది ఫలితాలు విడుదల- మెరిసిన తెలుగు తేజాలు

381views

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ 2024 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ఫలితాలను UPSC మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఇందులో శక్తి దూబేకు మొదటి ర్యాంకు లభించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు.

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఇ.సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్‌ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్‌ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్‌ 68 ర్యాంకులతో అదరగొట్టి టాప్​ 100లో చోటు దక్కించుకున్నారు. ఎన్‌ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డి 119, చల్లా పవన్‌ కల్యాణ్‌ 146, ఎన్‌.శ్రీకాంత్‌ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190, పోతురాజు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకులు వచ్చాయి.

టాప్‌ 10 ర్యాంకర్లు వీరే

శక్తి దుబే, హర్షిత గోయెల్‌, డోంగ్రే అర్చిత్‌ పరాగ్‌, షా మార్గి చిరాగ్‌, ఆకాశ్‌ గార్గ్‌, కోమల్‌ పూనియా, ఆయుషి బన్సల్‌ , రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌, మయాంక్‌ త్రిపాఠి

మొత్తం 1,009 మంది ఎంపిక
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చింది UPSC. అనంతరం జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది UPSC. ఈ మెయిన్స్‌లో రాణించిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17వరకు దశల వారీగా పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని UPSC ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87మంది చొప్పున ఎంపికయ్యారు.