News

బంగ్లాదేశ్‌లో హిందూ నేత కిడ్నాప్‌.. తీవ్ర గాయాలతో మృతి

210views

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆగట్లేదు. తాజాగా హిందూ కమ్యూనిటీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిని దుండగులు అతిదారుణంగా హత్య చేశారు. ఆయనను కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఢాకా మీడియా కథనాలు వెల్లడించాయి.

ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పుర్‌కు చెందిన భబేశ్‌ చంద్రరాయ్‌ (58)కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను ఇంట్లోనే ఉన్నానని భబేశ్‌ అవతలి వ్యక్తికి చెప్పారు. అరగంట తర్వాత నలుగురు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపుచర్యలు చేపట్టిన పోలీసులకు నరబరి గ్రామంలో భబేశ్‌ తీవ్రగాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కన్పించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారు. దుండగులు అతడిని తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మాజీ ప్రధాని షేక్‌హసీనా దేశం విడిచివెళ్లిన తర్వాత బంగ్లాదేశ్‌లో మైనార్టీలు, హిందువులపై క్రమంగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ కూడా స్పందించింది. పొరుగుదేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది. వీటిని నివారించడానికి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఇటీవల బంగ్లాదేశ్‌ అధికారులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై బంగ్లాదేశ్‌ ప్రెస్‌ సెక్రటరీ షఫీకుల్‌ ఆలం అనవసర వ్యాఖ్యలు చేశారు. దీన్ని భారత విదేశాంగ తీవ్రంగా ఖండించింది. తమపై నిందలు వేయడం మాని.. బంగ్లా తమ సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడటంపై దృష్టిసారిస్తే మంచిదని హితవు పలికింది.