
తమిళనాడులోని 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన, నిరుపయోగంగా ఉన్న 1,000 కిలోలకు పైగా బంగారు వస్తువులను కరిగించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాటిని 24 క్యారట్ల కడ్డీలుగా మార్చి బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపింది. తద్వారా ఏటా రూ.17.81 కోట్లు వడ్డీ రూపంలో ఆదాయం వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.
పెట్టుబడి ద్వారా వచ్చే వడ్డీని సంబంధిత ఆలయాల అభివృద్ధికే వినియోగిస్తామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. హిందూ మత, దేవాదాయ శాఖకు (హెచ్‌ఆర్&సీఈ) సంబంధించిన ఓ విధానపర పత్రాన్ని మంత్రి శేఖర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఒకరు చొప్పున ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మరిఅమ్మన్ ఆలయం నుంచి గరిష్ఠంగా 424 కేజీల బంగారం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హెచ్‌ఆర్&సీఈ శాఖ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న వెండి వస్తువులను కూడా కరిగించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపింది.





