News

పాక్‌లో రామాలయ నిర్మాణం… అయోధ్య రామాలయమే ప్రేరణ

244views

అయోధ్యలోని రామ మందిరం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తంగా మందిర పేరు ప్రతిధ్వనించింది. చివరకు పాకిస్తాన్‌ను కూడా అయోధ్య రామమందిరం ఆకర్షించింది. భారత్, పాక్ మధ్య సత్సంబంధాలు లేకపోయినా.. అక్కడి పౌరులు కొందరు అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్నారు.

అయితే.. పాక్‌లో ఓ ఆకర్షణీయ పరిణామం జరిగింది. సింధ్ ప్రావిన్స్‌లోని థార్పార్కర్ జిల్లాలో అయోధ్య రామాలయాన్ని ప్రేరణగా తీసుకొని, ఓ రామాలయం నిర్మాణం అవుతోంది. స్థానికంగా ఈ రామాలయ నిర్మాణం చర్చనీయాంశమైంది. వ్లాగర్ మఖన్ రామ్ ఇటీవలే దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసుకున్నారు.

ఆలయం నిర్మాణం కావడానికి స్థానికంగా వుండే తరురామ్ అనే అర్చకుడు ముఖ్య పాత్ర పోషించాడు. సత్సంగ్ కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే తరురామ్ అనే అర్చకుడు అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. గంగాజలాన్ని కూడా తీసుకెళ్లాడు. సింధ్ ప్రావిన్స్‌లో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణంలో, ఆచారాల్లో ఈ గంగా జలాన్ని వినియోగించనున్నాడు.

తాను అయోధ్య రామాలయాన్నే ప్రేరణగా తీసుకొని, రామాలయ నిర్మాణం చేయడానికి పూనుకున్నానని, పూర్తి ఆశీర్వాదాలివ్వాలని తాను అయోధ్య బాల రాముడ్ని వేడుకున్నానని వెల్లడించాడు. అయితే.. పాక్‌లో ఆలయ నిర్మాణానికి మద్దతు కూడా వస్తోందని, తనకు మరింత బలం చేకూరిందని ఆనందం వ్యక్తం చేశాడు.

అయితే.. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమై… ఇప్పటికే ఆరు నెలలు ముగిశాయి. దాదాపుగా నిర్మాణం పూర్తి కావొస్తోంది. ఆలయ సరిహద్దు గోడ నిర్మాణం కూడా అయిపోయింది. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు మాత్రం కొనసాగుతున్నాయి. విగ్రహ ప్రతిష్ఠ మాత్రం ఇంకా జరగాల్సి వుందని వెల్లడించారు.