
తాలిబాన్ ప్రభుత్వంలోని మంత్రి ఖలీద్ హన్ఫీ ముస్లిమేతరులందరిపైనా నోరు పారేసుకున్నాడు. హిందువులు, సిక్కులతో సహా ముస్లిమేతరులందరూ జంతువుల కంటే హీనులంటూ కించపరిచారు. ఆఫ్గన్ లో తాలిబాన్లు అంత: కలహాలతో పోరాడుతున్నారు.అంతర్గత పోరాటం అధికమైన సమయంలో ఈ కామెంట్స్ రావడం గమనించదగ్గ పరిణామం. ‘‘బహుదేవతారాధకులు, యూదులు, క్రైస్తవులు, హిందువులు, సిక్కులు పరిపాలనా పనులు చేస్తారు. కానీ వారు జంతువుల లాంటివారు. వారు ఖురాన్ కి విరుద్ధమైన భావాలను కలిగి వుంటారు’’ అంటూ కించపరిచారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సైద్ధాంతిక శిక్షణ ఇవ్వాలని కూడా సూచించారు. అంతేకాకుండా ముస్లిమేతర ఉద్యోగులు పరిపాలనా విధులు నిర్వర్తిస్తారని, అయితే.. వారి నమ్మకాలు వారిని నైతికంగా తక్కువ స్థాయికి జార్చేస్తాయని అన్నారు. అంతేకాకుండా తాలిబాన్ ప్రభుత్వం ఏలుబడిలో వున్న వారు తాలిబాన్ భావజాలాన్ని, ఇస్లామిక్ న్యాయశాస్త్ర విద్యను అభ్యసించాల్సిందేనన్నారు.
మంత్రి ఖలీద్ హనాఫీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అలాగే ఆఫ్గన్ లో హిందువులు, మైనారిటీల గౌరవ మర్యాదలపై, భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
తాలిబాన్ల విచిత్ర వ్యాఖ్యలు, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎప్పటి నుంచో ప్రపంచ పౌర సమాజం మండిపడుతూనే వుంది. మతం, జాతితో సంబంధం లేకుండా ఆఫ్గన్ పౌరులందరి హక్కులను కాపాడాల్సిందేనని ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ మానవ హక్కలు సంస్థలు పదే పదే కోరుతూనే వున్నాయి. అయినా తాలిబాన్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు.





