ArticlesNews

సామాజిక హితకారులు కందుకూరి వీరేశలింగం

518views

( ఏప్రిల్ 16 – కందుకూరి వీరేశలింగం జయంతి )

తరతరాలుగా భారతీయ సమాజంలో అనేక ఆచారాలకు ఎలాంటి ప్రామాణిక ఆధారాలు లేకపోయినా అత్యధికులు ప్రగాఢంగా విశ్వసించి, తార్కిక దృష్టి లేకుండా అనుసరిస్తూండేవారు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి సమాజంలో దురాచారాలు బలంగా నాటుకు పోయాయి.

సంఘ సంస్కరణ అంటే మార్పు కోరుతూ వేదికలపై అనర్గళంగా చేసే ఉపన్యాసం కాదు. సమాజమంతా సదాచారమని విశ్వసించి, ఆచరిస్తున్న ఒక సామాజిక దురాచారాన్ని ‘మీరు చేస్తున్నది తప్పు. ఇది అమానుషత్వం. ఆచరిస్తున్న దురాచారాలను ఎత్తి చూపి, నిర్భయంగా ప్రజల మధ్యకు చొచ్చుకు పోగలిగే వాడే అసలైన సంస్కరణవాది. అందుకు ఎంతో సాహసం కావాలి. తానుంటున్న సమాజాన్ని ఒప్పించి, మెప్పించి దురాచారాలను మాన్పించగలిగిన వాడే నిజమైన వీరుడు, సంస్కర్త.

ఆ కోవకు చెందినవారే ప్రముఖ సంఘ సంస్కర్త, ఆధునిక సాహిత్య యుగ సంఘ వైతాళికులు కందుకూరి వీరేశలింగం, 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన రాజమహేంద్రవరంలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు వీరేశలింగం జన్మించాడు.. వీరి పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం. ఇక్కడి నుండి రాజమహేంద్రవరంకి వలసెళ్లడంతో ‘కందుకూరు’ ఇంటి పేరుగా మారింది. నాలుగేళ్ల వయస్సులో తండ్రి సుబ్బారాయుడు చనిపోయాడు. పెదనాన్న, నాయనమ్మల పెంపకంలో వీరేశలింగం పెరిగారు. ఐదేళ్లకు బడిలో చేరాడు. రామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం నేర్చుకున్నాడు. పన్నెండేళ్లకు రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చదువులో ముందుండేవాడు. 1861లో వీరేశలింగం పదమూడేండ్లకు ఎనిమిదేళ్ల బాపమ్మతో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత రాజ్యలక్ష్మీగా పేరు మార్చారు.

బాల్య వివాహాలను విరేశలింగం పంతులుగారు వ్యతిరేకించారు. అలాగే వితంతువులకు పెళ్లి చేసేందుకు తానే ముందడుగు వేశారు. నాటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా 40 మంది వితంతువులకు పెళ్లిళ్లు చేయించాడు. స్త్రీల కొరకు ‘సతీహిత బోధిని’ పత్రికను నడిపారు. మూఢవిశ్వాసాలపై పోరాటం చేసారు వీరేశలింగం. అందుకోసం 1887లో సంఘ సంస్కరణ సమాజం స్థాపించారు. తెలుగు గడ్డకు బ్రహ్మసమాజాన్ని తీసుకువచ్చింది కందుకూరి వీరేశలింగమే. అలాగే యువజన సంఘాల స్థాపన కూడా తెలుగునాట ఆయనతోనే మొదలైంది. సమాజసేవ చేయాలనే సంకల్పంతో 1905లో హితకారిణీ సమాజాన్ని స్థాపించి తన ఆస్తి మొత్తాన్నీ ఆ సమాజానికే రాసిచ్చేసాడు.పాతికేళ్ళు రాజమండ్రిలోనూ, ఐదేళ్ళు మద్రాసులోనూ తెలుగు పండితుడిగా పనిచేసాడు. వీరేశలింగంకు ఆయన భార్య నుండి పూర్తి సహకారాలందేవి. భర్త అడుగుజాడల్లో నడిచిన రాజ్యలక్ష్మీ 1910లో మరణించారు.

కందుకూరి వీరేశలింగం మహా కవి కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం” నాటకాన్ని తెలుగులో అనువదించారు. ఆయన రాసిన ఆంధ్ర కవుల చరిత్ర, స్వీయ చరిత్ర బహుళ ప్రచారం పొందాయి. హిత కారిణి సమాజం ద్వారా ఎన్నో నాటకాలను రాసి ప్రదర్శించారు.ఆధునికాంధ్ర యుగకర్తగా ప్రసిద్దులైన వీరేశలింగం 1919 సంవత్సరం మే 27వ తేదీన మద్రాసులో పరమపదించారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని 2007 నుంచి తెలుగు నాటకరంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు..

‘‘తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగ కవి జనులార’’
అని ఆయన గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం చెప్పిన పద్యం ఆయన సమాధి మీద ఈనాటికీ నిలిచి ఉంది

జీవితాంతం సమాజ సేవకే అంకితమైన కందుకూరి వారి ఆశయసాధనకు మనమంతా కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.