ArticlesNews

రాకాసి కరాళనృత్యం జలియన్‌వాలాబాగ్ నరమేధం

279views

( ఏప్రిల్ 13 – జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన జరిగిన రోజు )

ఆ ఘటన బ్రిటిష్ పాలనలోని క్రూరత్వం, దౌర్జన్యానికి ప్రతీక. మానవాళి చరిత్రలోనే అదెంతో బీభత్సం. అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. భారతీయ ఆత్మ మీద జరిగిన దాడి. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలోనే అత్యంత విషాదకర, దురదృష్టకర, హేయమైనదిగా చెప్పుకునే ఈ ఘటన 1919 ఏప్రిల్ 13న చోటు చేసుకుంది. బ్రిటిష్ పాలకులు మారణహోమాన్ని సృష్టిస్తూ, రక్తాన్ని ఏరులై పారించారు. అనేక మంది భారతీయుల ప్రాణాలు తీశారు. ఇది జరిగి 100 ఏళ్లు దాటినా భారతదేశ చరిత్రలో ఇప్పటికీ అది చీకటి రోజుగా మిగిలిపోయింది. జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనను యావత్ భారతావని మర్చిపోలేకపోతోంది.

బ్రిటిష్ ప్రభుత్వం 1915లో రూపొందించిన భారతీయ రక్షణ చట్టానికి అదనంగా 1919లో రౌలత్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా వైస్రాయ్‌లకు విశేష అధికారాలు, పత్రికలపై సెన్సార్‌షిప్‌తో పాటు ఎలాంటి విచారణ, వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం బ్రిటిష్ పాలకులకు లభిస్తాయి. అందుకే, ఈ చట్టాన్ని ఖండిస్తూ పంజాబ్‌తో సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. తమ నాయకులను విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ అమృత్‌సర్‌లో ఉద్యమం మరింత తీవ్రమైంది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అరెస్టైన వారికి సంఘీభావం ప్రకటిస్తూ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో ఒక సభ ఏర్పాటైంది. అది 1919 ఏప్రిల్ 13. ఆ రోజు సిక్కులు, పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ దినం. హిందువులు, సిక్కులు, ముస్లింలతో పాటు మహిళలు, చిన్నారులు ఇలా దాదాపు 20 వేల మంది వరకు ఆనాటి సభకు వచ్చారు. వక్తల ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు. అదే సమయంలో బూట్లతో కవాతు శబ్దం వినిపించింది. జలియన్‌వాలాబాగ్‌ను అప్పటికే 90 మంది సైనికులు చుట్టుముట్టారు. ఈ సైనికులతో పాటు జనలర్ డయ్యర్ కూడా వచ్చాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ ఆదేశించాడు. సైనికులు తుపాకులు గురిపెట్టి కాల్పులు మొదలు పెట్టారు. సభలో హాహాకారాలు, జనాలు గాయపడుతూ, ప్రాణాలు వదులుతూ నేలకొరుగుతున్నారు. ఆ తోటలో ఉన్న బావిలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒకరు పై ఒకరు పడి ఊపిరాడక చనిపోయారు. క్షణాల వ్యవధిలోనే సాయుధ బలగాలు 1650 రౌండ్లు మేర కాల్పులు జరపగా 1000 మందికి పైగా ప్రాణాలు వదిలారు.

జలియన్‌వాలాబాగ్ రాక్షసకాండకు మూలకారకుడు డయ్యరే అయినా నాటి పంజాబ్‌ గవర్నర్‌ సర్‌ మైకేల్‌–ఓ– డయ్యర్‌ ప్రధాన పాత్ర పోషించాడు. మైఖేల్‌ డయ్యర్‌ పాత్రను నిర్థారిస్తూ 1969లో ఆధారాలతో ఓ పరిశోధనా పత్రం సమర్పించింది పంజాబ్‌ యూనివర్సిటీ. 600 మంది సాక్షులిచ్చిన వివరాలతో కూడిన నివేదిక అది. జలియన్‌వాలాబాగ్ ఘోరకలిపై విచారణకు ఏర్పాటైన హంటర్ కమిటీ ప్రశ్నలకు డయ్యర్ ఇచ్చిన సమాధానాలు అతడి మానసిక స్థితినే కాదు పాలన వ్యవస్థ వికృత ధోరణిని కూడా స్పష్టం చేశాయి. ముందస్తు ప్రణాళికబద్ధ వ్యూహం ప్రకారం పూర్తి అవగాహనతోనే తాను చర్యలు తీసుకున్నానని డయ్యర్ ఎలాంటి జంకుబొంకు లేకుండా చెప్పాడు. హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు అతడి క్రూర చర్యలను సమర్థిస్తూ పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదులను అంకితం చేసింది.

జలియన్‌వాలాబాగ్ ఘటనకు ప్రతిగా భారతదేశంలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన సర్ బిరుదును ఇంగ్లండ్ ప్రభువుకు తిరిగి ఇచ్చేశారు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు. భారతమాతను విముక్తి చేయడానికి నాటి త్యాగం మరియు అంకితభావం రాబోయే తరాలకు దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేలా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.