News

భారత్‌కు చేరుకున్న తహవూర్‌ రాణా.. ఢిల్లీలో హైఅలర్ట్‌

268views

26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్‌ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్‌ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి.