ArticlesNews

వర్థమాన మహావీరుడి మాట..సర్వమానవాళికి బాట

489views

( ఏప్రిల్ 10 – వర్థమాన మహావీరుడి జయంతి )

సత్యం, ధర్మం, అహింస ఈ విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషి చేసినవారు ఎందరో. అలాగే, సనాతన వేద భూమిలో జనించి ఈ మార్గాన్ని బోధించిన మతాలు ఎన్నో. అలాంటి వాటిలో జైన మతం ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారిని జైనులు అంటారు. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటేందుకు దోహదపడేవారని అర్థం. జైన మతాన్ని వృషభనాథుడు స్థాపించాడు. 21వ తీర్థంకరుడు నేమినాథుడిని శ్రీకృష్ణనికి సోదరుడు. ఇక 24వ తీర్థాంకరుడు వర్థమాన మహావీరుడు. ఈయనే ఆఖరివాడని జైనుల విశ్వాసం. వర్థమాన మహావీరుడిని జైన ధర్మ సంస్కర్తగా పేర్కొనవచ్చు. ఎందుకంటే తనకు పూర్వం ఉన్న పద్ధతుల్లో ఎన్నో మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు.

బుద్ధుడు పేరు వినగానే మనకు అహింస గుర్తుకు వస్తుంది. అహింసో పరమోధర్మ: అని హిందూ ధర్మం చెప్పినా, అహింస నిత్య జీవనంలో తప్పనిసరి భాగంగా ఉండాలని బుద్ధుడి కన్నా ముందు చెప్పినవాడు వర్థమాన మహావీరుడు. జైన మత తత్వ సిద్ధాంతాలను క్రోడీకరించిన వర్థమాన మహావీరుడు చైత్ర శుద్ధ త్రయోదశి రోజున, క్రీస్తు పూర్వం 599 సంవత్సరంలో మహారాజు సిద్ధార్థుడు, మహారాణి త్రిశల దంపతులకు బీహార్‌లోని వైశాలికి సమీపంలో ఉన్న కుందగ్రామంలో జన్మించారు. ఈ సంవత్సరం వర్థమాన మహావీరుడు జయంతిని ఏప్రిల్ 10న జరుపుకుంటున్నాము.

వర్థమాన మహావీరుడు హిందూ ధర్మంలో చెప్పిన విధంగానే జంతు బలులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. గోవధను వ్యతిరేకించారు. అలాగే ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పారు. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించిన వర్థమానుడు మనుషులందరూ ఒక్కటే అని చాటారు. లోకాస్సమస్తాం..సుఖినోభవంతు అంటూ లోక కళ్యాణాన్ని కాంక్షించే వేదాల మాదిరే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని వర్థమాన మహావీరుడి జైనమతం సైతం ఆకాంక్షించింది. అలాగే మోక్ష సాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. జైన మతాన్ని పునర్నిర్మాణం చేసిన శ్రీ భగవాన్ మహావీర్ స్త్రీ, పురుషులు ఇరువురూ సమానమే అని చెప్పారు. ఆయన ఎన్నో జైన సంఘాలను స్థాపించి పేద, ధనిక అని తేడాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలుపుకున్నారు. పునర్జన్మ లేకుండా మోక్ష ప్రాప్తి పొందాలంటే సమ్యక్ దృష్టి అంటే స్వచ్ఛమైన దృష్టి, సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం, సమ్యక్ చరిత్ర అంటే సరియైన నడవడిక ఉండాలని మానవాళికి బోధించాడు.

శ్రీ మహావీరుడు ఆయన అనుచరులు భిక్షువులకు ఐదు మహావ్రతాలు చేయించేవారు. వీటిలో మొదటిది అహింస..జీవం ఉన్న దేనికీ హాని తలపెట్టకూడదు, రెండవది సత్యం. ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. అసత్యం ఆడకూడదు. మూడవది అస్తేయం అంటే దొంగిలించకూడదు, ఇతరులకు చెందినది ఆశించకూడదు. నాల్గవది అపరిగ్రహం అంటే మనిషి తన అవసరాలకు మించి ఆస్తి దాచుకోకూడదు, ఐదవది బ్రహ్మచర్యం..అంటే శారీరకమైన కోర్కెలను దగ్గరకు రానీయకుండా, దృష్టినంతటినీ నిర్వాణం మీదనే కేంద్రీకరించాలి. వర్థమాన మహావీరుడు మొత్తం 55 ప్రవచనాలు, ఉత్తరాధ్యయన సూత్రాలు అనబడే ప్రసంగాలు చేశారు. ఆ కాలంలో ఎందరో రాజులు ఆయన భక్తి ప్రవచనాల ప్రభావంతో అనుచరులు అయ్యారు. 32 ఏళ్ల పాటు అహింసా ధర్మంతో దేశం నలుమూలలా తిరిగి తన సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన మహావీరుడు తన 72వ ఏట బీహార్‌లోని పావాపురి ప్రాంతంలో జీవన్మరణ-పునర్జన్మల నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. మానవ జీవితాన్ని అనవసర కాంక్షలూ, హింసాత్మక ధోరణులతో సంక్లిష్టం చేసుకోకుండా నిరాడంబరంగా, అహింసతో జీవిస్తూ మోక్షాన్ని సాధించాలనే మహావీరుడి బోధలు సర్వకాలాలకూ వర్తిస్తాయి. ప్రపంచశాంతికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.