News

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంతో ఆనందంలో మునంబం వాసులు

326views

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో మునంబం వాసులు ఆనందంలో మునిగిపోయారు. తమ భూములను కాపాడుకోవడానికి ‘‘మునంబం భూ సంరక్షణ సమితి’’ పేరుతో 173 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వక్ఫ్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో నరేంద్ర మోదీ జిందాబాద్… జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

అయితే తమ నిరసన మాత్రం ఇలాగే కొనసాగుతుందని వారు తెలిపారు. మునంబం భూ సంరక్షణ సమితి కన్వీనర్ జోసెఫ్ బెన్నీ మాట్లాడుతూ.. తమకు చాలా సంతోషంగా వుందన్నారు. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తమ ఆస్తులపై తామే హక్కులను పొందుతామన్నారు. అయితే… రాష్ట్రంలోని కాంగ్రెస్, వామపక్ష ఎంపీలు తమ అభిప్రాయాన్ని పార్లమెంటులో వినిపించడంలో పూర్తిగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. ఇది తమను బాగా బాధించిందన్నారు.

మునంబంలో ప్రజలు తమకు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇన్నాళ్ళూ దర్జాగా అనుభవిస్తున్నారు. అయితే, ఆ భూమిని కొన్ని తరాల క్రితం వారి పూర్వీకులకు ఎవరో విక్రయించారు. కానీ దాన్ని వారికి అమ్మలేదనీ, విరాళం లేదా కానుకగా మాత్రమే ఇచ్చామనీ ఫరూఖ్ కళాశాల ప్రస్తుత యాజమాన్యం తప్పుడుగా ప్రకటించుకుంది. దాని ఆధారంగానే ఆ భూములన్నీ వక్ఫ్ భూములు అని కేరళ వక్ఫ్ బోర్డు ప్రకటించేసింది. అందుకే కేసీబీసీ నాయకులు రంగంలోకి దిగారు. మునంబం ప్రాంత ప్రజలకు చెందిన భూముల గురించి వివాదం రేగినట్లు మరెక్కడా జరగకూడదని వారు కోరుకుంటున్నారు. అందుకే వక్ఫ్ సవరణ చట్టానికి తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులు పూర్తి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మునంబం తీర ప్రాంతంలో 404 ఎకరాల భూమి చుట్టూ మునంబం వక్ఫ్ భూ వివాదం తిరుగుతోంది. ఈ భూమిలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి, ప్రధానంగా లాటిన్ కాథలిక్ కమ్యూనిటీకి చెందిన క్రైస్తవులు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన హిందువులు ఉన్నారు. ఈ కుటుంబాలు దశాబ్దాలుగా ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నాయి. 1950లో నమోదైన వక్ఫ్ దస్తావేజును ఉటంకిస్తూ కేరళ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ భూమిపై హక్కులు పొందింది. అయితే ఈ భూమిపై చట్టబద్ధమైన హక్కులు తమవేనని, ఒకప్పుడు దాని నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ఫరూక్ కాలేజీ నుంచి దశాబ్దాల క్రితం కొనుగోలు చేశామని నిర్వాసితులు చెబుతున్నారు.