News

మనోజ్ కుమార్ కు ఆరెస్సెస్ సంతాపం

336views

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ మృతిపట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ ఎక్స్ మాధ్యమం వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ప్రముఖ నటుడు, పద్మశ్రీ మనోజ్ కుమార్ మరణం చాలా బాధాకరం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ గారు దేశభక్తికి సంబంధించిన అనేక చిత్రాల ద్వారా సమాజంలో చెరగని ముద్ర వేశారు. ఆయన నటించిన దేశభక్తి చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆయనకు నివాళి అర్పిస్తోంది. ఈశ్వరుడు ఆయనకు మోక్షాన్ని ప్రసాదించు గాక’’ అని పేర్కొన్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని కోకిలాబెన్‌ ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు. దేశ భ‌క్తి చిత్రాల‌కి ఆయ‌న బాగా ప్రఖ్యాతి చెందారు. తన విలక్షణ నటన, దర్శకత్వంతో బాలీవుడ్‌ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మనోజ్‌కుమార్‌ మృతితో భారతీయ సినిమా ఒక యుగాన్ని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.

మనోజ్ కుమార్ పూర్తి పేరు హరికృష్ణ గిరి గోస్వామి. 1937 జులై 24వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని అబాటాబాద్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. 1957లో ‘ఫ్యాషన్’ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘హరియాలీ ఔర్ రాస్తా’ (1962), ‘షహీద్’ (1965) వంటి చిత్రాలతో గుర్తింపు సాధించారు. 1967లో విడుదలైన ‘ఉప్కార్’ చిత్రం ఆయనకు ‘భారత్ కుమార్’ అనే బిరుదు వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన దేశభక్తి ఆధారిత చిత్రాలను ఎక్కువగా దర్శకత్వం వహించారు.

‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970), ‘రోటీ కపడా ఔర్ మకాన్’ (1974), ‘క్రాంతి’ (1981) తదితర సినిమాలతో మనోజ్ కుమార్ దేశ సామాజిక సమస్యలను, జాతీయ భావాలను తట్టి లేపారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చాయి. ఆయన రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తన సత్తాను చాటారు.