ArticlesNews

రామం.. రాఘవం…

400views

(శ్రీరామనవమి ప్రత్యేకం )

‘రాజవర శేఖరం రవికుల సుధాకరం..’ అంటూ ‘దేవదేవం భజే’ కీర్తనలో రాముణ్ణి కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. రాముడు ధైర్యవంతుడు, సత్యవంతుడు, సర్వ సమర్థుడు. క్రోధాన్ని జయించినవాడు, సకల ప్రాణుల శ్రేయస్సూ కోరేవాడు. అలాంటి సకల గుణాభిరాముణ్ణి కూడా వేలెత్తి చూపారు. మల్లెల పరిమళానికీ, తేనెల మాధుర్యానికీ కూడా వంకపెట్టడం లోక రివాజు మరి. నిజానికి రాముడి ఔన్నత్యం, నిబద్ధతల వల్ల తను, తనవాళ్లు ఇబ్బంది పడ్డారే కానీ తనను నమ్మిన ప్రజలు మాత్రం తలెత్తుకు జీవించారు. కొడుకుగా, భర్తగా, తండ్రిగా తను ధర్మం తప్పలేదు, తనవారిని తప్పనివ్వలేదు.

కైకమ్మ మాటల్ని తండ్రి మౌన ఆదేశంగా భావించి పితృవాక్పరిపాలనా ధర్మాన్ని పాటించిన ధర్మస్వరూపుడు రామచంద్రుడు. ఆయన పరిపూర్ణతను ఆవిష్కరిస్తూ 64 గుణాలను చెప్పాడు వాల్మీకి మహర్షి. నాయకునిగా రామునిలోని క్షాత్రం, క్షమ, దండన, స్నేహశీలత, దాన గుణం, అపరిగ్రహం, అణకువ మొదలైన సుగుణాలు ప్రజల జీవితాల్లో వెన్నెల్ని కురిపించాయి.

తన తపశ్శక్తిని రాముడికిచ్చేశాడు
క్షత్రియునికి ప్రాథమికంగా కావలసింది పరాక్రమం. క్షతం (దెబ్బ) నుంచి రక్షించేవాడే క్షత్రియుడు. ఎందరో రాజులను సంహరించిన పరశురాముడు సుక్షత్రియుడైన రామచంద్రుని పరాక్రమం ముందు తలవంచి తన తపశ్శక్తిని రాముడికి ధారపోశాడు. శ్రీరాముడి వింటినారిని తెంచగలిగిన పరాక్రమవంతుడు ఖరుడు. అటువంటి ఖరుడు, దూషణుడు తదితర 14 వేలమంది రాక్షసుల్ని తృటిలో మట్టుపెట్టిన క్షాత్రం రామచంద్రునిది.

క్షమకు చిరునామా
వీరత్వం క్షమతో ప్రకాశిస్తుంది. తన అరణ్యవాసానికి కారణమైన మంధరను క్షమించటమే కాదు.. ఆమెని వేరెవరూ శిక్షించకుండా కట్టుదిట్టం చేశాడు. తన ఆరో ప్రాణమైన సీతమ్మను అరణ్యంలో ఇబ్బంది పెట్టిన కాకాసురుణ్ణి క్షమించాడు. అంతే కాదు రావణాసురుడు యుద్ధరంగంలో అలసిపోతే.. కొంతసేపు సేదతీరి కొత్త రథం, ఆయుధాలతో రమ్మని చెప్పిన క్షమామూర్తి ఆయన.

జీతం ఇవ్వాలి.. సంరక్షించాలి..
క్షత్రియుడిగా జన్మించిన రాముడు అధికారంలో ఉన్నా లేకున్నా క్షాత్రధర్మం పట్ల నిబద్ధత చూపాడు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని స్వీకరించమంటే.. తండ్రి ఉన్నా లేకున్నా ఇచ్చిన మాట తప్పటం ధర్మం కాదని భరతుడికి సర్దిచెప్పాడు. విద్వాంసులు, తోటి రాజులు, వ్యాపారులు, రైతులు, సేవకుల పట్ల రాజు వ్యవహరించాల్సిన తీరుతెన్నుల్ని ఉపదేశించాడు. లవణాసురునిపై యుద్ధానికి వెళ్తున్న శత్రుఘ్నునికి- సైన్యానికి జీతం ఇచ్చేందుకు ధనం తీసుకువెళ్లమని, తిరిగి వచ్చేవరకూ సైనిక కుటుంబాల సంరక్షణకు ఏర్పాటు చేయమని చెప్పాడు. అధర్మపరులను వధించటంలోనూ ఇదే నిబద్ధత. సుగ్రీవుడి సాయం తీసుకున్నాడే గానీ.. అధికారంలో ఉన్నప్పటికీ వాలిని ఆశ్రయించలేదు రాముడు. వాలి బలవంతుడైనా, తనకార్యాన్ని ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగినవాడైనా కూడా తమ్ముడి భార్యను అపహరించినందున ఆ అధర్మపరుణ్ణి పరిహరించాడు.

మండోదరికి వరం
రాక్షసుల బారి నుంచి కాపాడమని ప్రార్థించిన మహర్షులకు నమస్కరించి, అది తన బాధ్యతనీ, వారు అడిగేవరకు సమస్యను పరిష్కరించనందుకు సిగ్గుపడుతున్నానని చెప్పాడు రాముడు. అలాగే రావణ వధానంతరం మండోదరి యుద్ధభూమికి రాగా.. ఆమెకి వైధవ్యం ప్రాప్తించదంటూ వరం ప్రసాదించాడు. మన కష్టాలు చాలక రాక్షసులతో విరోధం ఎందుకన్న సీతమ్మకు రాజధర్మాన్ని వివరించాడు. ప్రజల కోసం అవసరమైతే ప్రాణ ప్రదమైన ఆమెని, లక్ష్మణుణ్ణి కూడా వదులుకుంటానని నిక్కచ్చిగా చెప్పాడు. తాను క్షత్రియుడైనప్పటికీ ఆటవికుడైన గుహుడు, వానరుడైన సుగ్రీవుడు, రాక్షసుడైన విభీషణుడు, పక్షిరాజైన జటాయువు.. ఇలా జాతిభేదం లేకుండా స్నేహం చేశాడు రాముడు. మైత్రికి మంచితనమే తప్ప పదవి ముఖ్యం కాదని నిరూపించాడు.

శిక్షించాడు.. వెళ్లిపోయాడు..
రాజదండన విషయంలో స్వపరభేదం లేదు రాముడికి. కాలపురుషుడు రాముడితో ఏకాంతంగా మాట్లాడాలనీ, అందుకు అంతరాయం కలగకూడదని కోరాడు. దుర్వాసుడి ప్రేరణతో వారి సంభాషణకు భంగం కలిగించాడు లక్ష్మణుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాణప్రదంగా ప్రేమించే సోదరుణ్ణి దేశం నుంచి బహిష్కరించాడు రాముడు. రాజధర్మాన్ని అనుసరించి శిక్ష విధించిన రాముడు- అన్నగా దాన్ని భరించలేక లవకుశులకు రాజ్యాన్ని అప్పగించి తను కూడా రాజ్యం విడిచి వెళ్లిపోయాడు. రాజుకు ఉండాల్సిన ప్రాథమిక గుణాల్లో దానం ఒకటి. తండ్రి మాటను గౌరవించి సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి బయల్దేరిన సమయంలో, అశ్వమేధ యాగ నిర్వహణ వేళ, రాజ్యాన్ని పరిత్యజించిన సందర్భం.. ఇలా ఎలాంటి పరిస్థితిలోనైనా రాముడు బంగారం, గోవులు, పంటపొలాలను విచక్షణతో దానం చేశాడు.

ఆభరణాలు వద్దు.. ఉపదేశాలు చాలు
ఇవ్వడమే తప్ప తీసుకోవటం రాజధర్మం కాదు. అగస్త్యుడు ఒకసారి దేవశిల్పి విశ్వకర్మ రూపొందించిన విలువైన దివ్యాభరణాల్ని స్వీకరించమన్నాడు. కానీ రాముడు అది ధర్మ విరుద్ధమని సున్నితంగా తిరస్కరించి, ఆభరణాల స్థానంలో ఉపదేశ వచనాల్ని ప్రసాదించమన్నాడు. అలానే రావణవధానంతరం విభీషణుడు పుష్పకవిమానం ఇవ్వగా దాన్ని స్వీకరించకుండా.. అసలు యజమాని అయిన కుబేరుడికి ఇచ్చేశాడు.

అనుమానం తీర్చాడు.. పవిత్రత చాటాడు..
‘సీతా! నువ్వు పవిత్రమే. కానీ కంటిజబ్బు ఉన్నవారికి దీపకాంతి కనిపించదు. నేను ప్రస్తుతం లోకమనే కంటిజబ్బుతో బాధ పడుతున్నాను’ అంటూ సీతమ్మకు వివరించాడు రాముడు. తనతో పాటు రాజసింహాసనంపై కూర్చోవాల్సిన సీతపై ప్రజలకు ఎలాంటి సందేహం ఉండకూడదని, వాళ్ల అనుమానాన్ని తీర్చాడు, ఆమె పవిత్రతను లోకానికి చాటాడు. కైక అడిగిన అనుచిత కోరికలకు కోపగించిన దశరథుడు ఆమెని తన భార్యగా నిరాకరించాడు. రావణ వధానంతరం ఇంద్రునితో పాటు తండ్రి తనకు దర్శనమివ్వగా.. కైకమ్మను క్షమించాల్సిందిగా ప్రార్థించాడు రాముడు. పరిస్థితుల ప్రాబల్యంతో తనకు కష్టం కలిగించినప్పటికీ తనవారిపట్ల ప్రేమ, ఆత్మీయతలనే ప్రదర్శించాడు రాముడు. ధర్మబద్ధుడైన రాజుగా ప్రజలకోసం వ్యక్తిగత సౌఖ్యాలే కాదు, ప్రాణానికి ప్రాణమైన జానకిని కూడా వదులుకోవటానికి సిద్ధపడిన పూర్ణపురుషుడు రామచంద్రుడు. యుగయుగాలకూ ఆదర్శనీయం రామరాజ్యం.