
మన్యం కొండల్లో మామిడికాయ పండుగ సందడి నెలకొంది.ఏలూరు జిల్లాలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కొండరెడ్లు మామిడికాయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి లయబద్ధంగా డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
వేసవిలో మామిడికాయ పండుగ అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ జరిపిన తర్వాత మాత్రమే గిరిజనులు మామిడికాయను తింటారు. ఉగాది రోజున ఇళ్లలో, గ్రామాల్లో ,తోటల్లో కాసిన మామిడి కాయలను అందరూ పండగకు కోసుకొని తీసుకొచి అక్కడ పూజల అనంతరం తింటారు. ప్రతి గ్రామంలో గంగానమ్మతో పాటు ఆయా గ్రామాల్లోని వన దేవతలను గిరిజనులు పూజిస్తారు. ఆయా దేవతలకు దూప దీప నైవేద్యాలతో ఘనంగా పూజలు చేసిన తర్వాతే మామిడి కాయలు చెట్ల నుంచి కాయలను కోస్తారు. ప్రతి ఇంటికీ కోడిని తీసుకువచ్చి గ్రామ దేవతకు మొక్కుగా ఇస్తారు. గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్ని కోళ్లు మొక్కుగా ఇస్తారు. ఆ కోళ్లును వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. మామిడికాయ పండుగలో దేవతలకు పూజలనంతరం గ్రామంలోని చిన్నాపెద్దా కలిసి ఒక గుజిడీ (స్థలం) ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి కోడి కూర తెచ్చుకుని లొట్లలో తాటి కల్లు ఏర్పాటు చేసుకుని జీడి, మామిడి ఆకులతో, దారకాయలతో తాటికల్లును సేవిస్తారు.

తమ పూర్వీకుల నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న మామిడికాయ, బాట పండుగ, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలని కొండరెడ్డి గిరిజనులు కోరుతున్నారు. ప్రతి ఏడాది వేసవికాలంలో తాము జరుపుకునే పండుగకు సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం గ్రామస్తులందరూ చందాలుగా వేసుకోవడంతోపాటు కొంతసొమ్ము ప్రజల నుంచి వసూలు చేసి వాటితో పండుగ జరుపుకుంటున్నామని కొండరెడ్డి గిరిజనులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ పంటలను గుర్తించి ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
గిరిజన సంప్రదాయ నృత్యాలు
మామడి కాయ పండుగను పురస్కరించుకుని గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా గిరిజన సంప్రదాయ రేల నృత్యాలు చేస్తారు. ఈ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆదివారం కంసాలి కుంటలో ఈ ప్రారంభమైన ఈ మామిడికాయ పండుగలో సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ పాల్గొని వన దేవతలకు పూజలు చేయడంతో పాటు మహిళలతో కలిసి గిరిజన నృత్యాలు చేశారు.





