ArticlesNews

అన్నం… అమృతం

285views

మనిషి పుట్టుకకు, జీవనానికి అన్నమే మూలం. అందుకే ఉపనిషత్తులు అన్నాన్ని ‘ప్రజాపోషకం’ అన్నాయి. మనిషి అన్నప్రాణి. కాబట్టి మనల్ని పోషించే అన్నాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవించి, భుజించాలి. కేవలం మనుషులకే కాదు పురుగులకు, పక్షులకు కూడా అన్నం పంచిపెట్టాలని వేదం పలికింది.

ఆకలి తీర్చుకోవడానికి భోజనం ఎంత ముఖ్యమో పద్ధతిగా తినడం కూడా అంతే ముఖ్యం. పరిశుభ్రమైన ఆహారాన్ని తినాల్సిన పద్ధతిలో తింటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి ఆహారంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చెడు ఆలోచనలకు తావివ్వదు. ఆబగా తినడం, ఆకలి వేస్తేనే తిందామనుకోవడం, ఏదో తిన్నాం అన్నట్టుగా అనాసక్తిగా రెండు ముద్దలు కతికి చేయి కడిగేసుకోవడం… ఏదీ సరి కాదు. భోజనానికి సమయపాలనతో పాటు తృప్తిగా తినడమన్నది కూడా చాలా ముఖ్యం. భోజనం చేసేటప్పుడు ఇంకా కాస్త తిందామని అనిపిస్తూండగానే తినడం ఆపేయాలి. కడుపులో ఎప్పుడూ కాస్త ఖాళీ ఉంచుకోవాలి. అప్పుడే తిన్నది చక్కగా జీర్ణమవుతుంది. మితభోజనం దివ్యౌషధం అని వైద్యులూ చెబుతారు కదా. అలాగే భోజనం చేయగానే పడుకోవడమూ సరికాదు. కనీసం ఓ నూరు అడుగులైనా అటు ఇటు తిరగమని ఆయుర్వేద వైద్యశాస్త్రం సూచిస్తోంది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకునేముందు గుక్కెడు నీటితో గొంతు తడుపుకోవాలి. ఇలా చేస్తే ముద్ద గొంతుకు అడ్డుపడదు. తొలిముద్దచేత పట్టుకుని అన్నపూర్ణాదేవిని స్మరించుకుని తినడం మంచి పద్ధతి. పంక్తి భోజనానికి కూర్చున్నప్పుడు పదార్థాల వడ్డన పూర్తయ్యాకనే తినడానికి ఉపక్రమించాలి. అలాగే తినడం అయిపోగానే మధ్యలో లేచి వెళ్లిపోకూడదు. ఒకేసారి అందరితోపాటు లేవాలి.

రోజుకు ఒక్కపూట భోంచేసేవాడు మహాయోగి. రెండుసార్లు భుజించేవాడు మహాభోగి. అంతకన్నా ఎక్కువసార్లు తినేవాడు రోగి అన్నారు జ్ఞానులు. భోజన సమయంలో చర్చలు, ఆవేశాలు, ఉద్వేగాలు, ఈర్ష్య, భయం, కోపం, లోభం, దైన్యం మొదలైనవి తలెత్తకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి చోటుచేసుకున్నా అమృతంలాంటి ఆహారం కూడా శరీరానికి చేటుచేస్తుంది. సుఖాసనంపై కూర్చుని శాంతంగా, సంతుష్టిగా స్వీకరించిన ఆహారం వల్ల శరీరంలోని సర్వధాతువులూ వృద్ధి చెంది సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ప్రతిజీవికి అవసరమైన ఆహారాన్ని ప్రకృతి సిద్ధంచేస్తుంది. దాన్ని వృథా చేస్తే మరొకరికి లోటు చేసినవాళ్లమవుతాం. అందుకే ఆహారాన్ని వృథా చేయడం పాపమంటారు పెద్దలు.

నీతిశాస్త్రంలో చెప్పినట్లు భోజన సమయాన్ని విధిగా పాటించాలి. తనకోసం వందమంది వేచి ఉన్నా సరే సమయానికి తినేయాలి. వేయిమంది ఎదురు చూస్తున్నా తప్పనిసరిగా స్నాన పానాదులు ముగించుకోవాలి. లక్షమంది వద్దని వారించినా చేయాల్సిన దానం చేసి తీరాలి. కోటిమంది వద్దని అడ్డుపడినా భగవంతుడి ధ్యానం చేసి తీరాలి… అంటోంది నీతిశాస్త్రం. దాన్ని అందరూ ఆచరించాలి.