News

వాస్తవాలను వక్రీకరించి హిందూ వ్యతిరేక చిత్రం

770views

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతుదారులు ఈ మూవీని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణించారు. అయితే, కాంగ్రెస్‌, సిపిఎం ఈ చిత్రానికి మద్దతు ప్రకటించగా, బీజేపీ మాత్రం మౌనంగా ఉండిపోయింది.

ఎంపురాన్‌ చిత్రం ఈ నెల 27న విడుదల కాగా ప్రేక్షకుల నుంచి స్పందన వస్తున్నది. ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ఆర్గనైజర్‌లో ప్రచురించిన కథనం ప్రకారం ఈ చిత్రం 2002 గోద్రా అల్లర్ల నేపథ్యాన్ని ఉపయోగించి హిందూ వ్యతిరేక రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకువస్తుందని ఆరోపించింది. ఈ మూవీ కధనం హిందువులను కించపరచడమే కాకుండా, ప్రత్యేకంగా హిందూ అనుకూల రాజకీయ భావజాలాలను లక్ష్యంగా చేసుకుంటుందని విమర్శించింది.

ఈ సినిమా హిందూ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కథనాన్ని వ్యాప్తి చేయడానికి ఒక మాధ్యమమని, వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారంటూ మండిపడింది. భారతదేశంతో సహా ఉపఖండంలో జరుగుతున్న మారణహోమం మధ్య హిందువులను విలన్లుగా చిత్రీకరించే హిందూ వ్యతిరేక ప్రచార చిత్రం ఎంపురాన్ అంటూ మండిపడింది.

ఆర్ఎస్ఎస్ ప్రేరణలతో పనిచేస్తున్న సంస్థ ప్రజ్ఞ ప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె నందకుమార్ కూడా ఈ చిత్రం హిందూత్వ వ్యతిరేక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని విమర్శించారు.నందకుమార్ తన ఫేస్‌బుక్ పేజీలో గోద్రా రైలు దహనం సంఘటనకు సంబంధించిన వార్తలను కూడా పంచుకున్నారు.

కేరళలోని హిందూత్వ గ్రూపుల గొడుగు సంస్థ అయిన కేరళ హిందూ ఐక్య వేదిక అధ్యక్షుడు ఆర్ వి బాబు మాట్లాడుతూ, “ఈ చిత్రం 2002లో జరిగిన గోద్రా రైలు దహనం (ఇందులో హిందూ యాత్రికులు మరణించారు) బాధితులకు అన్యాయం చేసింది. గోద్రా జరిగి ఉండకపోతే, ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు జరిగేవి కావు అనే వాస్తవాన్ని ఈ చిత్రం గ్రహించలేక పోయింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి ఉగ్రవాద సంస్థలు ప్రభావం చూపినప్పుడు, కేరళ అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు బాధితురాలిగా మారినప్పుడు, ఈ చిత్రం దీనిని విస్మరిస్తుందని, హిందూత్వ భావజాలం కలిగిన సంస్థను ధిక్కారంగా దోషిగా నిలబెట్టిందని ఆయన విమర్శించారు.

బీజేపీకి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం అనంతరం బీజేపీ కేరళ ప్రధాన కార్యదర్శి పీ సుధీర్‌ మాట్లాడుతూ ఈ చిత్రం తన దారిలో వెళ్తుందని.. పార్టీ సైతం తన పని తాను చేసుకుంటుందనిపేర్కొన్నారు. ఈ సినిమాతోనూ పార్టీ ప్రభావితం కాదని పేర్కొంటూ సంఘ్‌కు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచే హక్కు ఉందని తెలిపారు. అది మంచి చిత్రమా? లేదా? అన్నది నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకులకు ఉందని చెప్పారు.

కేరళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కుట్టతిల్ ఈ చిత్రానికి మద్దతు ప్రకటించారు. చిత్రాన్ని నిర్మించిన నిర్మాత పురస్కారానికి అర్హుడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి దివంగత కొడియేరి బాలకృష్ణన్ కుమారుడు, నటుడు బినీష్ కొడియేరి పేర్కొన్నారు.