
చైనాలోని భారత రాయబార కార్యాలయం ‘‘వసంత్ మేళా’’ పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి దాదాపు 4వేల మందికి పైగా చైనీయులు తరలివచ్చారు. భారత్-చైనా సంబంధాలను తిరిగి సాధారణం చేసే దిశలో ఇదొక కొత్త ప్రారంభం కానుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక భారతీయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ నృత్యాలు చేసినవారిలో అధికులు చైనీయులే కావడం విశేషం. చైనా విదేశాంగ శాఖలో ఆసియా విభాగ డైరెక్టర్ లియు జిన్‌సాంగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన లియుకు, ప్రత్యేక అతిథులకు వేలమంది చైనా పౌరులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ స్వాగతం పలికారు. లద్దాఖ్‌లో నాలుగేళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతలు భారత్-చైనా సంబంధాలను స్తంభింపజేశాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల మధ్య గత అక్టోబరులో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన చర్చల అనంతరం సంబంధాల పునరుద్ధరణకు మార్గం తెరచుకుంది. ఈ నేపథ్యంలో జరిగిన ‘‘వసంత్ మేళా’’లో భారత రాయబారి రావత్‌తో పాటు ఆయన భార్య శృతి రావత్, ఉప రాయబారి అభిషేక్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భరతనాట్యం, కథక్‌లతో సహా మొత్తం ఐదు శాస్త్రీయ నృత్యాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. హిందీ సినిమా పాటలు, నృత్యాలు ప్రత్యేకంగా అలరించాయి. మేళాలో భాగంగా ఏర్పాటుచేసిన 35 ఆహార స్టాళ్లలో భారతీయ వంటకాల కోసం చైనీయులు ఎగబడ్డారు. బీజింగ్‌లోని భారతీయ రెస్టారెంట్లు ఈ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. భారతీయ హస్తకళలు, ఆభరణాలు, వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.





