
పాక్‌లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని, బలోచిస్థాన్‌ను అస్థిరపరిచే కుట్రలో న్యూదిల్లీ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందని పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి షఫఖత్ అలిఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తన గడ్డ నుంచి ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండ సాగిస్తోందని ఆరోపించారు. పాక్ ఒక్కటే కాదు, దక్షిణాసియా దేశాలు అన్నింటినీ అస్థిరపరచాలని భారత్ చూస్తోందన్నారు. బలోచిస్థాన్‌లో మార్చి 11న జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్, ప్రయాణికుల కాల్చివేత ఘటనను భారత్ ఇప్పటిదాకా ఖండించలేదని షఫఖత్ అన్నారు. వారం రోజుల కిందట కూడా పాక్ ఇటువంటి ఆరోపణలు చేయగా, భారత్ వెంటనే వాటిని ఖండించింది. ప్రపంచ ఉగ్రవాద కేంద్రమేదో అందరికీ తెలుసని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. దిల్లీలో జరుగుతున్న రైసీనా సదస్సులో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన ప్రసంగంపైనా పాక్ స్పందించింది. జమ్మూకశ్మీర్ గురించి భారత నాయకత్వం తరచూ చేస్తున్న అనవసర ప్రకటనలపైనా తాము అప్రమత్తం కావాల్సి ఉందని షఫఖత్ అలిఖాన్ అన్నారు.





