News

పంజాబ్‌లో భారీ కుట్ర భగ్నం: ముగ్గురు బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్‌

227views

పంజాబ్‌లో హత్యలకు ఖలిస్థానీ సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్‌, పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను జగ్‌రూప్‌ సింగ్‌ అలియాస్‌ జగ్గా, సుఖ్‌జిత్‌ సింగ్‌ అలియాస్‌ సుక్కా, నవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ నవ్‌లుగా గుర్తించారు. వీరి నుంచి అత్యాధునిక గ్లాక్‌ 9ఎంఎం పిస్టోల్‌, ఒక మ్యాగ్జైన్‌, పీఎక్స్‌5 స్ట్రామ్‌ పిస్టోల్‌, ఒక మ్యాగ్జైన్‌, ఒక దేశీయ తయారీ 30 బోర్‌ గన్‌, మరో దేశీయ తయారీ 32 బోర్‌ తుపాకీ, తూటాలను స్వాధీనపర్చుకొన్నారు.

ప్రాథమిక దర్యాప్తులో అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గురుప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ గోపీ నౌషహరియా వీరి హ్యాండిలర్‌గా గుర్తించారు. అతడు పాక్ కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ ఉగ్రవాదులు హర్వీందర్‌ సింగ్‌ రిండా, గ్రీస్‌ కేంద్రంగా పనిచేసే లాడి బకాపురియాకు అత్యంత సన్నిహితుడు. తాజాగా నిందితులపై అమృత్‌సర్‌లో కేసు నమోదు చేశారు.

మహా కుంభమేళాలో ఉగ్రదాడికి పథకం వేసిన ఉగ్రవాది లాజర్‌ మసీహ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశంబిలో అరెస్టు చేశారు. అతడికి ఐఎస్ఐ, బబ్బర్‌ ఖల్సాతో సంబంధాలున్నాయి. గతంలో ఆయుధాలు, హెరాయిన్‌ స్మగ్లింగ్‌ కేసులో ఒకసారి జైలుకు వెళ్లిన మసీహ్‌.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబరు 24న ఆసుపత్రి నుంచి పారిపోయాడు. తర్వాత సోనీపత్, దిల్లీలో తలదాచుకున్నాడు. గతంలో పీలీభిత్‌లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వినేశ్‌సింగ్‌ అలియాస్‌ రవితో అతనికి సంబంధాలున్నాయి. అమెరికాలో ఉంటున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాదితో, ఖతార్‌లో తలదాచుకుంటున్న మరో ఉగ్రవాదితోనూ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అతని కదలికలపై సమాచారంతో కౌశాంబిలోని కోఖ్రాజ్‌ ఠాణా పరిధిలో పంజాబ్‌ పోలీసులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌ ఎస్‌టీఎఫ్‌ బృందం సభ్యులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు దాడిచేసి పట్టుకున్నారు. అతని నుంచి మూడు గ్రనేడ్లు, రెండు డిటోనేటర్లు, విదేశీ తయారీ పిస్తోల్, 13 క్యాట్రిడ్జ్‌లు, పేలుడు స్వభావమున్న పౌడర్, సిమ్‌ లేని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహాకుంభమేళాలో భద్రత ఎక్కువగా ఉండటంతో అతడి ఉగ్రదాడి ప్రణాళిక పారలేదు.