
తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా చేసిన అభ్యర్థనను యూఎస్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈమేరకు ఇటీవల అతడు వేసిన అత్యవసర పిటిషన్‌ను కొట్టివేసింది. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆ పిటిషన్‌లో ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఇదే అభ్యర్థనతో అతడు కోర్టులో మరోసారి పిటిషన్ వేశాడు.
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దాంతో అతడు గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దానిని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ.. 20పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దానిని పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.





