
ఇరాన్‌లో మరోసారి హిజాబ్ అంశం కలకలం సృష్టిస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన గాయకుడికి 2023లో శిక్ష పడింది. తాజాగా ఆయనకు 74 కొరడా దెబ్బలు విధించాలని అక్కడి న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
2022లో ఇరాన్ అంతటా హిజాబ్‌కు వ్యతిరేక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నిరసనకారులకు మద్దతుగా గాయకుడు మెహదీ యర్రాహి ఓ పాట పాడారు. 2023లో అక్కడి అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. దోషిగా తేలిన ఆయన గతేడాది విడుదలయ్యారు. తాజాగా ఈ కేసుపై రివల్యూషనరీ కోర్టు తీర్పునిచ్చింది. మెహదీకి 74 కొరడా దెబ్బలు విధించాలని న్యాయమూర్తి ఆదేశించనున్నట్లు గాయకుడి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తనకు పడిన శిక్షపై గాయకుడు స్పందిస్తూ.. ‘స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించడానికి ఇష్టపడని వ్యక్తి స్వేచ్ఛకు అర్హుడు కాదు’ అని పేర్కొన్నారు. ఇక, మెహదీకి పడిన శిక్షపై ఆయన మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తమ గళాన్ని విప్పారు.
1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అయితే చాలామంది మహిళలు దీన్ని వ్యతిరేకించారు. ఈ అంశాలు అమలయ్యేలా దేశంలోని నైతిక పోలీస్ విభాగం పర్యవేక్షిస్తుంది. 2005లో ఈ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఇరాన్‌లో ఒక ప్రత్యేక పోలీసు విభాగం. స్థానికంగా ‘గస్త్-ఎ-ఇర్షాద్’గా పిలుస్తారు. పౌరులు ఇస్లామిక్ నైతిక విలువలను గౌరవించేలా చూడటం, సక్రమంగా దుస్తులు ధరించనివారిపై చర్యలు తీసుకోవడం వంటివి.. సిబ్బంది విధుల్లో భాగం. ఈ క్రమంలోనే 2022లో ఇరాన్‌ను హిజాబ్ నిరసనలు కుదిపేశాయి. మాసా అమీ అనే యువతి హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి ఆమె మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ మృతి వార్తతో వేలమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనను తెలియజేశారు. వారికి అంతర్జాతీయ సమాజం మద్దతు తెలుపుతూ ఆందోళనకారులపై టెహ్రాన్ ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించింది.





