
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్రను చరిత్రకారులు సరిగ్గా పట్టించుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు. శంభాజీ జీవిత కథతో రూపొందిన ‘ఛావా’ చిత్రాన్ని వీక్షించిన ఆయన.. సినిమా చాలా బాగుందన్నారు. శంభాజీ ధైర్య సాహసాలను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని, యోధుల చరిత్రపై ఈ సినిమా నేటి తరానికి ఎంతో అవగాహన కల్పిస్తుందన్నారు.
మరోవైపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అసీమ్ నజ్మీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శంభాజీ మహారాజ్‌ను వేధించిన ఔరంగజేబును ప్రశంసించడంపై అధికార కూటమి తీవ్ర స్థాయిలో మండిపడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయనపై చర్యలకు పట్టుబట్టింది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు ముగిసే (మార్చి 26) వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ఆయనపై ఎస్పీ చర్యలు తీసుకోవాలి – యోగీ
ఔరంగజేబును కీర్తించిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఆయనపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.





