News

దేవాలయ భూముల జోలికి వెళ్ళొద్దన్న ఏపీ సీఎం.

683views

వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పేదల ఇళ్ల స్థలాల కోసం దేవాలయ భూముల జోలికి రాకూడదని నిర్ణయించుకుంది.

రాబోయే ‘ఉగాది’ నాడు 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలోనూ అందుకు అనువైన భూములను గుర్తించవలసిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులలో హై కోర్టు అనుమతితో వేలం వేయదగ్గ దేవాలయాలు, మఠాలు, పీఠాలకు చెందిన భూములను కూడా గుర్తించవలసిందిగా ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి మరియు ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

ఈ అంశంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ళ స్థలాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయ భూములను తాకరాదని అధికారులకు స్పష్టం చేశారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే 20 లక్షల మంది అర్హులైన పేదలను గుర్తించామని, మిగిలిన వారిని కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని, దీనంతటికీ సుమారు 40 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని సమావేశంలో పాల్గొన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే సుమారు 21,948 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేశామని, మరో 19000 ఎకరాల భూమి అవసరమవుతుందని, దానిని అవసరమైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించమని సీఎం చెప్పారని ఆయన వివరించారు.

కొన్ని జిల్లాలలో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించబడి, అన్ని అనుమతులూ ఉండి కూడా నిరుపయోగంగా పడి ఉన్న భూములు ఉన్నాయని, అవసరమైతే వాటిలోంచి భూమిని  సేకరించవచ్చని కొందరు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధంగా భూమి సేకరించడానికి సుమారు 8 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని కూడా అధికారులు అంచనాకు వచ్చారు. ఈనెలాఖరుకు అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియను మొదలుపెడతామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.