News

దక్షిణాఫ్రికాలో బృహత్తర హిందూ మందిర నిర్మాణం….2027లో ప్రారంభం

225views

నిరుడు అబూధాబీలో భారీ హిందూ ఆలయాన్ని నిర్మించిన బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ(బాప్స్) ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మరో బృహత్తర హిందూ ఆలయ సముదాయ నిర్మాణాన్ని చేపట్టింది. 2027లో ప్రారంభమయ్యే ఈ మందిరం దక్షిణార్ధ గోళంలోనే అతిపెద్ద హిందూ ఆలయం-సాంస్కృతిక కాంప్లెక్స్ అవుతుంది. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు కూలీలుగా వచ్చిన భారతీయుల సంతతి దీని నిర్మాణంలో కీలక భాగస్వాములవుతున్నారు. దక్షిణాఫ్రికా రాజధాని జొహెన్నస్ బర్గ్ లోని ముఖ్యమైన ప్రదేశంలో 37,000 చదరపు మీటర్ల స్థలంలో బాప్స్ హిందూ ఆలయ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయం 2500 చదరపు మీటర్లలో నిర్మితమవుతుంది. స్వామినారాయణ్ తో పాటు రాధాకృష్ణులు, సీతారాములు, శివపార్వతులు, తిరుపతి వేంకటేశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, హనుమాన్ గుడులూ ఉంటాయి. అబూధాబీ ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా భారతీయ సంస్కృతితో పాటు స్థానిక కళలు, సంస్కృతు లను మేళవిస్తారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం పన్నులు, వ్యాట్ మినహాయింపులు ఇచ్చి మందిర నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది.