News

విద్యతో త్యాగ భావన అలవడాలి : మోహన్ భాగవత్

349views

విద్యా భారతి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సరస్వతీ విద్యా మందిర్ బిహార్ లోని సుపౌల్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే కార్యం సత్యం ఆధారితంగా వుండాలని, ప్రజలకు ఉపయోగంగా వుండాలన్నారు. ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి వుంటుందన్నారు.

ఈ రోజుల్లో పాఠశాలలను నడపడం వ్యాపారమని, కానీ… భారతీయ సంస్కృతిలో విద్య డబ్బు సంపాదించే మాధ్యమం కాదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. చదువు మన కడుపు నింపుకోవడం కోసం కాదని, జంతువులు, పక్షులు కూడా తమ కడుపు నింపుకుంటాయన్నారు. కేవలం కుటుంబ పోషణ కోసమే విద్య వుంటే అర్థమేమి ? అని ప్రశ్నించారు. విద్య మనిషిని మనిషిలా వుంచడానికి, మనిషిలా తయారు కావడానికి ఉపకరిస్తుందన్నారు.

ఈ సందర్భంగా విద్యా భారతి గురించి మాట్లాడుతూ దేశంలో 21,000 కి పైగా పాఠశాలలను నడుపుతోందని, విద్యార్థుల గుణాత్మక నిర్మాణానికి కృషి చేస్తోందని ప్రశంసించారు. ఉన్నత విద్యావంతులు, సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమని, తన కుటుంబం, గ్రామం, దేశం కూడా ఇలాగే ఉండేలా ప్రయత్నించాలన్నారు. విద్య మనిషిలో స్వార్థం అన్న భావన కాకుండా అందరూ మనవారే అన్న భావన నింపాలన్నారు. భారత్ అంతా ఒక్కటే… మనమంతా ఒకే భూమిపుత్రులం అన్న భావన రావాలన్నారు.విద్య ద్యారా త్యాగం అలవడాలని, భారత్ లో త్యాగ భావనకు ఆరాధనా భావం వుందన్నారు.