ArticlesNews

శ్రీకాళహస్తి.. చరిత్రాత్మక ఘన కీర్తి

557views

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం చారిత్రాత్మక ఖ్యాతి.. ప్రాభవాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 1700 ఏళ్ల కిందట పల్లవుల కాలంలో ఆలయ అభివృద్ధికి బీజం పడిందని చరిత్రకారుల అభిప్రాయం.

పల్లవులు: క్రీస్తు శకం.. అయిదో శతాబ్దంలో పల్లవుల హయాంలో ఇక్కడి ఆలయంలో మరిన్ని మండపాలు, ఆలయ ప్రాకార నిర్మాణాలు చేపట్టినట్లు చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

చోళులు: పల్లవుల ప్రాభవం తగ్గాక.. ఇక్కడి ప్రాంతమంతా చోళరాజులకు సొంతమైంది. ఆ సమయంలో జయంకొండ చోళమండల పరిధిలోని ఇక్కడి ఆలయాన్ని చోళవంశీయులు పలువురు అభివృద్ధి చేశారు. రాజాధిత్య చోళుడు, రాజరాజచోళుడు, రాజేంద్రచోళుడు ఇక్కడి ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. రాజేంద్ర చోళుడు కుమారుడు కుళోతుంగ చోళుడు దక్షిణం వైపు గోపుర నిర్మాణాన్ని చేపట్టినట్లు స్థల పురాణం ఆధారంగా తెలుస్తోంది. మూడవ కుళోతుంగ చోళుడు ఆలయాన్ని అభివృద్ధి పరిచారు.

పాండ్యులు: పాండ్యరాజులు ఇక్కడి ప్రాంతాన్ని పెద్దగా అభివృద్ధి చేయకున్నా.. వాళ్ల హయాంలో ఆలయంలోని ప్రధాన గోపురాలకు, మండపాలకు మరమ్మతులు చేయించినట్లు తెలుస్తోంది.

రాయల వంశీయులు: 12వ శతాబ్దంలో విజయనగర రాజైన వీరనరసింహరాయలు హయాంలో పలు గోపురాలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు 1516లో గజపతులను ఓడించి విజయం సాధించినందుకు విజయప్రస్థాన ప్రతీకగా.. ఇక్కడ 126 అడుగుల ఎత్తుతో రాజగోపురాన్ని, నూరు స్తంభాలతో వందకాళ్ల మండపాన్ని, విజయస్తంభాన్ని నిర్మించారు. 2010 మే నెల 26వ తేదీన కుప్పకూలిన రాజగోపురాన్ని నవయుగ నిర్మాణ సంస్థ నూతన రాజగోపురాన్ని నిర్మించింది. అచ్యుతరాయలు 16 కాళ్ల మండపాన్ని నిర్మించడంతో పాటు ఆలయంలోనే పట్టాభిషేకం చేసుకున్నట్లు చరిత్ర కారుల అభిప్రాయం. గోపురాల గోడలపై విజయనగర సంస్థానాదీశుల రాజముద్రను సందర్శించవచ్చు.