
చిరుధాన్యాల రైతులకు పంట ఉత్పత్తుల రవాణాకు అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి భగీరథ్ చౌధరి తెలిపారు. దీనివల్ల రైతులకు లబ్ధి చేకూరడమే గాక వినియోగదారులకు చౌకధరలకు చిరుధాన్యాలు లభ్యమవుతాయన్నారు. ఎరువుల సబ్సిడీని భవిష్యత్‌లో నేరుగా రైతుల ఖాతాకు బదిలీ చేస్తామని, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణపరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కిసాన్‌మేళా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘చిరుధాన్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. రైతులకు దక్కే ధరలు, వ్యాపారులు వినియోగదారులకు అమ్మే ధరల్లో అంతరం ఉంటోంది. దీనిని తగ్గించేందుకు రైతుకు అయ్యే రవాణా ఖర్చులో 50 శాతం కేంద్రం చెల్లిస్తుంది. చిరుధాన్యాల సాగును లాభదాయకంగా మార్చడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో కేవీకేలు, రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషించాలి’’ అని సూచించారు.
చిరుధాన్యాలపై రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ఐఐఎంఆర్ విశేష కృషి చేస్తోందని సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉపకులపతులు జానయ్య, రాజిరెడ్డి.., ఎన్‌ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ నరేంద్రకుమార్‌లు మాట్లాడుతూ.. చిరుధాన్యాల సాగును ఉద్యమస్థాయిలో విస్తరించాలని, మద్దతు ధరలను ప్రకటించడంతో పాటు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. అపెడా రీజినల్ డైరెక్టర్ ఆర్‌పీనాయుడు, అతారి డైరెక్టర్ మీరా, ఐఐవోఆర్ డైరెక్టర్ మాథుర్, నిమ్స్‌మే డీజీ గ్లోరీ స్వరూప పాల్గొన్నారు. ఐఐఎంఆర్‌కు చెందిన 30 ప్రచురణలను మంత్రి ఆవిష్కరించారు. ఉత్తమ రైతులకు పురస్కారాలను అందించారు. అనంతరం చిరుధాన్యాల కిసాన్‌మేళా ప్రదర్శనను భగీరథ్ చౌధరి ప్రారంభించారు.





