News

జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ ఘోస్ట్‌

232views

అమెరికాకు చెందిన ఒక ప్రైవేటు ల్యాండర్‌ చందమామపై విజయవంతంగా కాలుమోపింది. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ సంస్థకు చెందిన ‘బ్లూ ఘోస్ట్‌’ వ్యోమనౌక ఈ ఘనత సాధించింది. చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా.. సరైన స్థితిలో వ్యౌమనౌకను దించిన తొలి ప్రైవేటు సంస్థగా చరిత్ర సృష్టించింది. జాబిల్లిపైకి మానవసహిత యాత్రల పునఃప్రారంభానికి ముందు అక్కడ వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో మరిన్ని ప్రైవేటు ల్యాండర్లు అక్కడ దిగనున్నాయి. చందమామ కక్ష్య నుంచి ఆటోపైలట్‌ సాయంతో బ్లూ ఘోస్ట్‌.. జాబిల్లి ఈశాన్య భాగంలోని ఒక పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో కాలుమోపింది. ల్యాండింగ్‌ విజయవంతంగా జరిగినట్లు ఫైర్‌ఫ్లై సంస్థకు చెందిన మిషన్‌ కంట్రోల్‌ కేంద్రం ధ్రువీకరించింది. పెద్ద శిలలు వంటి అవరోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో అది దిగిందని పేర్కొంది. ‘‘చంద్రుడిపై ఉన్నాం. ల్యాండర్‌ స్థిరమైన స్థితిలో ఉంది’’ అని ప్రకటించింది. ల్యాండింగ్‌ ప్రదేశంగా నిర్దేశించిన 100 మీటర్ల ‘మారే క్రిసియం’లోనే వ్యోమనౌక దిగినట్లు ప్రాథమిక డేటా సూచిస్తోందని ఫైర్‌ఫ్లై అధికారులు తెలిపారు. అరగంట తర్వాత నుంచి అది ఫొటోలు పంపడం మొదలుపెట్టింది. తొలుత సెల్ఫీని క్లిక్‌మనిపించింది.