News

భారత నేవీలో చేరనున్న ఐఎన్‌ఎస్‌ తమల్‌

265views

భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రష్యాలో నిర్మిస్తున్న ‘ఐఎన్‌ఎస్‌ తమల్‌’ యుద్ధ నౌక పనులు తుది దశకు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా తీర భద్రతతోపాటు దేశీయ స్వీయ భద్రతలో భాగంగా రెండు నౌకలను నిర్మించడానికి 2016 అక్టోబరులో రష్యాతో భారత్‌ ఒప్పందం చేసుకుంది. దీనికోసం రూ. 2.5 బిలియన్‌ డాలర్లను ఖర్చుచేస్తోంది. తొలిగా ‘ఐఎన్‌ఎస్‌ తుషీల్‌’ నిర్మాణం పూర్తికాగా.. గత ఏడాది డిసెంబరు 9న రష్యాలో జరిగిన కార్యక్రమంలో భారత రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. ఈ నౌక విధుల్లో చేరిన మరుక్షణం నుంచి స్వదేశానికి వస్తూనే సమర్థంగా సేవలను అందించి ఈ ఏడాది ఫిబ్రవరి 15న కార్వార్‌ బేస్‌కు చేరుకుంది. ఇదే క్రమంలో రెండో యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ తమల్‌’కు కూడా సీట్రయల్స్‌లో ఉంది. నిశ్శబ్దంగా శత్రు లక్ష్యాలను ఛేదించగలిగే శక్తి సామర్థ్యం గల రాడార్‌ వ్యవస్థను దీనికి ఏర్పాటు చేశారు. సముద్ర జలాల్లో చాలా వేగంతో దూసుకుపోగలదు. బ్రహ్మోస్‌ వంటి క్షిపణులు, టార్పెడోలు, రాకెట్ లాంఛర్లు, హెలికాప్టర్లకు ఒక బేస్‌గా ఉపయోగపడుతుంది. మొత్తం 180 మంది అధికారులు, సిబ్బంది దీనిమీద పనిచేయనున్నారు. ఇప్పటికే భారత్‌ నౌకాదళానికి చెందిన క్రూ మొత్తం రష్యాలో ప్రత్యేక శిక్షణ పొందారు. త్వరలో ‘ఐఎన్‌ఎస్‌ తమల్‌’ భారత నేవీలో చేరబోతోంది.