
బంగ్లాదేశ్‌లో గతేడాది అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కులు ఉల్లంఘనలకు గురయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. జాతి వివక్ష వ్యతిరేక నిరసనల సందర్భంగాను, ఆ తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. మరోవైపు జులై 1 నుంచి ఆగస్టు 15 మధ్య విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, వారిలో 12-13 శాతం మంది చిన్నారులేనని పేర్కొంది. బంగ్లాదేశ్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల కారణంగానే ఎక్కువ మంది మరణించారంది. దీనికి ఆ దేశ గత (షేక్ హసీనా) ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక ‘‘హిందూవులకు చెందిన గృహాలు, వ్యాపారాలు, ఆలయాలపై భారీ దాడులు జరిగాయి. ముఖ్యంగా ఠాకుర్‌గావ్, లాల్‌మొనిర్‌హట్, దినాజ్‌పుర్, సిల్హెట్, కుల్నా, రంగ్‌పుర్ వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. అవామీలీగ్ మద్దతుదారులు లక్ష్యంగా ఈ విధ్వంసం జరిగింది’’ అని మంగళవారం విడుదల చేసిన ‘ద ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్యాక్ట్-ఫైండింగ్’ నివేదిక తెలిపింది. ‘హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అండ్ అబ్యూజెస్ రిలేటెడ్ టూ ద ప్రొటెస్ట్స్ ఆఫ్ జులై అండ్ ఆగస్టు 2024 ఇన్ బంగ్లాదేశ్’ పేరిట నివేదికను రూపొందించింది. మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 3000-4000 మంది హిందువులు భారత్ సరిహద్దు వద్ద ఆశ్రయం పొందారని తెలిపింది. ఆ దాడులకు పాల్పడినవారు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ), జమాత్-ఏ-ఇస్లామీ, పలు ఇతర సంస్థల మద్దతుదారులని ప్రత్యక్షసాక్షులు తెలిపారంది. అల్లరి మూకలు హిందూ మతానికి చెందిన ప్రధానోపాధ్యాయులను, టీచర్లను తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలంటూ బలవంతం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయంది.





