
నెల్లూరులో డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి డ్రగ్స్ మాఫియా సింహపురిని వణికించింది. కాలేజీ విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్ధుల చేతుల్లో డ్రగ్స్ కనిపించడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముగ్గురు కాలేజీ విద్యార్ధులు, ఇద్దరు నైజేరియన్లు అరెస్టయ్యారు. ఈ డ్రగ్స్ కల్చర్ కు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో ధర్నా జరిగింది. డ్రగ్స్ మాఫియా దిష్టిబొమ్మను ఏబీవీపీ నాయకులు దగ్ధం చేశారు. డ్రగ్స్ కల్చర్ కు అడ్డకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కో – కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రoలో డ్రగ్స్ మాఫియా ఎక్కువైందన్నారు. దీనిని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నగర సహాయ కార్యదర్శులు జయంత్, బాషాలు మాట్లాడుతూ నగరంలో ఉన్న కళాశాలలలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని, కళాశాలలో ఉన్న అధ్యాపకులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని, కొందరు అధ్యాపకులైతే కళాశాలల్లో డ్రగ్స్ వ్యాపారానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు. అలాగే దీని వెనక ఉన్నవారు ఎంతవారైనా వారిని వదలకుండా జైలుకి తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి పరిషత్ విద్యార్థి ఉద్యమనికి తెర తీస్తుందని పోలీస్ శాఖను, విద్యాధికారులని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి, సుధీర్, జితేంద్ర, శివ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.





