
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చి అపుడపుడే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెడుతున్న మహాత్మాగాంధీ 1918 నాటి కుంభమేళాను సందర్శించి, ఆధ్యాత్మిక వేడుకలో స్వరాజ్యస్ఫూర్తిని రగిలించారు. ‘మినీ ఇండియా’లా అన్ని ప్రాంతాల వ్యక్తులు గుమికూడే ఈ మేళాను భారతీయుల్లో పోరాటస్ఫూర్తిని నింపేందుకు సరైన వేదికగా మహాత్ముడు భావించారు. గురువారం గాంధీ వర్ధంతి సందర్భంగా అలనాటి విశేషాలు చర్చకు వచ్చాయి. ‘‘బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజాసమూహాన్ని చైతన్యపరిచేందుకు మహాకుంభ్ ఓ మాధ్యమంలా ఉపయోగపడుతుందని బాపు భావించారు. నాటి మహాకుంభ్ స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ వర్గాల నాయకులు, విప్లవకారులు, పాత్రికేయులు, రచయితలకు సమావేశ స్థలిగా మారింది’’ అని అలహాబాద్ విశ్వవిద్యాలయ సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ కోర్స్ కోఆర్డినేటరు ధనంజయ్ చోప్రా తెలిపారు. రీజనల్ స్టేట్ ఆర్కైవ్స్‌లో భద్రపరచిన రికార్డుల ప్రకారం నాటి కుంభమేళాకు విచ్చేసిన గాంధీ పర్యటనను బ్రిటిష్ అధికారులు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా డాక్యుమెంట్ చేసినట్లు చోప్రా వెల్లడించారు. కుంభమేళాలో పరిశుభ్రత లోపంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాపు.. ఇలాంటి కార్యక్రమాలకు ప్రజల్లో క్రమశిక్షణ చాలా అవసరమని అభిప్రాయపడినట్లు ఆయన ముని మనవడు తుషార్‌గాంధీ తెలిపారు. 1948 జనవరి 30న మహాత్ముడు మరణించాక ఆయన చితాభస్మాన్ని ఫిబ్రవరి 12న త్రివేణీసంగమంలోనే నిమజ్జనం చేశారు.





