
అయోధ్యలో విపరీతమైన భక్తుల తాకిడి మొదలైంది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించి, రామ్ లల్లా దర్శనార్థం వచ్చేస్తున్నారు. 30 గంటల్లోనే 25 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. భక్తులందరూ తమ అయోధ్య దర్శనాన్ని 20 రోజుల వరకూ వాయిదా వేసుకోవాలని కీలక సూచనలు చేసింది. అయోధ్యలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే ఈ సూచనలు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ట్రస్ట్ ఓ ట్వీట్ చేసింది.
పవిత్ర స్నానాల తర్వాత అయోధ్య దర్శనానికి కూడా వస్తారు.సమీప ప్రాంతాల నుంచి వచ్చే వారు తమ దర్శనాన్ని 15 నుంచి 20 రోజుల వరకు వాయిదా వేసుకోండి. రాముడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులభ దర్శనం చేయించాల్సిన బాధ్యత మాపై వుంది. ఈ మేరకు భక్తులను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాం’’ అని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది.
ప్రయాగరాజ్ వేదికగా మహాకుంభమేళా రంగరంగ వైభోగంగా జరుగుతోంది. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అయోధ్య దర్శనం కూడా చేసుకుంటున్నారు. దీంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఈ అంచనాకి యూపీ ప్రభుత్వం ఎప్పుడో వచ్చేసింది. అందుకే మహాకుంభ మేళా తర్వాత అయోధ్య దర్శనానికి వస్తారని గ్రహించే… భక్తులకు ఇబ్బందులు లేకుండా యోజన చేసింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రణాళికలు వేశారు.
స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై కూడా శ్రద్ధ వహించడంతో అధికార గణం కూడా అలర్ట్ అయ్యింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్, ఐజీ ప్రవీణ్ కుమార్, జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ జాతర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.రామ మందిరానికి రద్దీ ఎక్కువవుందని ముందే గ్రహించి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా రోడ్లను కూడా వెడల్పు చేసింది. ఢిల్లీలో కర్తవ్య పథ్ లాగే… అయధ్యలో కూడా రాంపథ్ ను నిర్మించారు. అయితే… ఊహించిన దానికంటే భక్తులు రావడంతో రాంపథ్ కూడా నిండిపోయింది.అంతే కాకుండా జన్మభూమి మార్గం, రామాలయానికి వెళ్లే రహదారి, హనుమాన్‌గర్హికి వెళ్లే భక్తిపథ్, ధర్మపథ్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది.
రామాలయంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ట్రస్ట్ అంగద్ తిల నుండి భక్తులు బయటకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసింది, అయితే రద్దీ ఊహించని విధంగా ఉండటంతో, గేట్ నంబర్ 3 నుండి కూడా బయటికి వెళ్లడానికి సౌకర్యాలు చేశారు.హనుమాన్‌గర్హి వద్ద కిలోమీటరున్నర పొడవునా లైన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త లేన్‌ను సిద్ధం చేశారు.





