
భారతీయ సనాతన హైందవ సంప్రదాయాల్లో యోగాకు ఒక ప్రత్యేకత ఉందని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి దుర్గారావు అన్నారు. రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాకుళం జిల్లా అంతటా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ.. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు .. ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఫిబ్రవరి 2,3,4, తేదీల్లో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న రథసప్తమి వేడుకలు సంబంధించి ముందస్తుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో సోమవారం సూర్య నమస్కార కార్యక్రమం ఒక ప్రణాళిక బద్ధంగా చేశారు.
ఈ సందర్భంగా దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ సూర్య నమస్కారాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, సూర్య నమస్కారాలు సాధన జీవితాన్ని ఇచ్చే శక్తిని ప్రోత్సహించడంతో పాటు అనేక శారీరిక మానసిక సమస్యలను తొలగించేదుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఐదు నిమిషాల పాటు సూర్య నమస్కారాలు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రస్థాయి వేడుకలు పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వివిధ హై స్కూల్స్ లో కూడా ఈ సూర్య నమస్కారాలు కార్యక్రమం జరిగిందని చెప్పారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సుమారు 800 మంది బాలబాలికలు సూర్య నమస్కారాలు ఇతివృత్తంగా చేశారు. సూర్య నమస్కారాలు వల్ల కలిగే ప్రయోజనాలను అధ్యాపకులు సిబ్బంది వివరించారు.





