
జవాన్లు, ఆటగాళ్లు దేశ ఐక్యతకు, గర్వకారణానికి ప్రతీక అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. వీరిద్దరూ జాతీయ జెండాను మోస్తారని తెలిపారు. వారు దేశంలోని ఏ మూలనుంచైనా రావొచ్చని, ఏ కులం వారైనా కావొచ్చని, లేదంటే ఏ భాషకు చెందిన వారైనా కావొచ్చన్నారు. కానీ వారు మన దేశస్థులని, వీరిద్దరికీ పౌరులు కృతజ్ఞతగా వుండాలన్నారు. భోపాల్ లో క్రీడా భారతి ఆధ్వర్యంల ‘‘జిజామాత సమ్మాన్’’ కార్యక్రమం జరిగింది. ఇందులో దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు క్రీడాకారుల మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు.
పతకాలు సాధించిన క్రీడాకారులను తయారు చేసిన వారి కష్టాన్ని, పోరాటాన్ని గుర్తించి, వారిని గౌరవించడం ఎంతో అవసరం అన్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జీజియా మాత ఛత్రపతి శివాజీని తయారు చేసిందన్నారు. జీజియామాత గొప్ప తల్లి మాత్రమే కాదని, నైపుణ్యం కలిగిన ఓ నిర్వాహకురాలు అని కూడా తెలిపారు. శివాజీ మహారాజ్ ను ఔరంగజేబు జైలులో పెట్టినప్పుడు, జీజియామాత రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించిందన్నారు. ఎవరి దగ్గరా తన కొడుకు పనిచేయడని తేల్చి చెప్పింది కూడా. ఆ శివాజీయే పాలకుడిగా మరి, సమాజానికి సేవ చేశారన్నారు. జీజియామాత గొప్ప సంకల్పానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. శివాజీ జీవితంలో ఈ లక్షణాలన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తూనే వుంటాయన్నారు.
శివాజీకి చిన్నప్పటి నుంచి రామాయణ, భారత కథలను చెప్పి, తల్లి పెంచిందని పేర్కొన్నారు.దీంతో శివాజీలో ఎలాంటి ప్రవర్తన రావాలో అది వచ్చిందన్నారు. మరోవైపు కొన్ని క్రీడలను మాత్రమే ప్రోత్సహిస్తే అర్థం లేదని, అన్ని క్రీడలనూ ప్రోత్సహించాలని సూచించారు. అన్ని రకాల ధర్మాలకూ కుటుంబమే కేంద్రమని తెలిపారు. కుటుంబాల నుంచి యువత మంచి మంచి విలువలను గ్రహించే వాతావరణం కుటుంబాల్లో వుండాలన్నారు.





