ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతితోనే లౌకిక భారతం సాకారం

1.1kviews

మ్మడి పౌరస్మృతి” పై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం అత్యంత ఆవశ్యకం. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంపై దృష్టిసారించని గత ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉన్న ఈ తరుణంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం “ ఉమ్మడి పౌరస్మృతి” అంశాన్ని స్వీకరించే అవకాశం ఉంది. నిజానికి ఉమ్మడి పౌర స్మృతి ద్వారా అన్యమతస్తులపై హిందువుల పెత్తనాన్ని రుద్దాలనే దురుద్దేశం రాజ్యాంగ నిర్మాతలకు గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ లేదు. ‘ఉమ్మడి పౌరస్మృతి’ రచనకు ఒక నిపుణుల కమిటీని నియమించడం ప్రస్తుత పరిస్థితులలో అత్యుత్తమం. ఈ కమిటీ అన్ని మత విశ్వాసాలు, చట్టాల నుంచి ఆమోదయోగ్యమైన అంశాలను గుర్తించి ఉమ్మడి పౌరస్మృతిలో పొందుపరచి ప్రజల ముందు చర్చకు పెట్టాలి. నిజానికి ఈ పని భారత్ కి సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిన 1950లలోనే చేసి ఉండాల్సింది. లౌకిక వాదాన్ని తన విధానంగా స్వీకరించిన భారత రాజ్యాంగ సభ మత చట్టాల మనుగడని కూడా అనుమతించడం ఒక ఘోర తప్పిదం. అలాగే హిందూ చట్టాలను మాత్రమే పొందుపరచిన/మార్పులు చేసిన మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప లౌకికవాదిగా గుర్తింపు పొందడం కూడా గొప్ప వింతే. ఈ తప్పిదాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి పొంతన లేదు.

లౌకిక చట్టాలకి తావు లేనప్పుడు భారత లౌకికతకు అర్థమేముంది? నిజానికి భారతీయులందరినీ ఒక్కటి చేయడానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం. ఒక వేళ మోడీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ప్రయత్నిస్తే మేథో వర్గమంతా దానికి మద్దతు పలకాల్సి ఉంది. గతంలో కొందరు కుహనా లౌకికవాదులు ప్రచారం చేసినట్లుగా ఉమ్మడి పౌరస్మృతి మతసంబంధ విషయమేమీ కాదు. విధాన పరంగానూ, ఆచరణ పరంగానూ భారత్ ను నిజమైన లౌకిక రాజ్యంగా నిలుప గలిగే ఏకైక మార్గం ఉమ్మడి పౌరస్మృతి. దీంతో భారత్ కి ఉన్న కుహనా లౌకిక వాద ముద్ర కూడా తొలగిపోయి భారత్ నిఖార్సైన లౌకిక వ్యవస్థకి చిరునామాగా నిలుస్తుంది.

– దుగ్గరాజు శ్రీనివాస రాజు, విజయవాడ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.