
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్యస్నానాలపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపింది.
మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించారు. 1.7 కోట్ల మంది పౌష్ పూర్ణిమ వేడుకలో పాల్గొన్నారు. దీంతో పండుగల వేళలో స్నానాల ప్రదేశంలో భక్తుల సంఖ్యపై పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండవు. అయితే.. ఈ సారి కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి.





