
దేవభూమి ఉత్తరాఖండ్ లో అక్రమంగా నడుస్తున్న మదర్సాలు 190 ఉన్నాయి. రాష్ట్ర పోలీసులు జరిపిన తనీఖీలలో ఇవి బయటపడ్డాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ఛామి కూడా వెల్లడించారు. రాష్ట్రంలో ఇలా అక్రమంగా నడుస్తున్న మదర్సాలను కనుగొనవలసిందని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను, మైనారిటీ సంక్షేమ శాఖను ఆదేశించింది. ఇంకొక లెక్క ప్రకారం 419 రిజిస్టరయిన మదర్సాలు పని చేస్తున్నాయి. తమ దర్యాప్తులో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయని పోలీసు శాఖ చెప్పింది. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ మొదలు ఉద్దంసింగ్ నగర్, హల్ద్వానీ, నైనిటాల్ జిల్లాలలో లెక్కలేనన్ని మదర్సాలు అనుమతులు లేకుండానే నడుస్తున్న విషయం బయటపడింది. క్రమబద్ధీకరణ వ్యవస్థ కన్నుగప్పి ఇన్ని అక్రమ మదర్సాలు ఇన్ని జిల్లాలలో పనిచేయడం ఆందోళన కలిగించే విషయమని పోలీసు అధికారులు చెబుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన పుష్కర్సింగ్ ధామి (బీజేపీ) ఎన్నికల సమయంలోనే చట్ట విరుద్ధంగా నిర్మించిన మసీదులను కూల్చివేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి మాత్రమే పనిచేయాలన్న సూత్రానికి తాము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక్క ఉద్దంసింగ్ నగర్ జిల్లాలోనే 129 మదర్సాలు అక్రమంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ నితిన్ బధూరియా కూడా వెల్లడించారు. వీటిలో వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే హల్ద్వానీ, నైనిటాల్ జిల్లాలలో 26 అక్రమ మదర్సాలు ఉన్నాయి. కాగా మదర్సాల ఆదాయ వివరాలు బహిర్గతం చేయాలన్న డిమాండ్ మొదలయింది. ఇలా ఉండగా మైనారిటీలు ఏం చేసినా నోరెత్తకూడదని చెప్పే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పు పట్టింది. ఈ పని ఇప్పుడే ఎందుకని రాష్ట్ర కాంగ్రెస్ ప్రశ్నించింది.





